తెలంగాణ విషయానికి వస్తే పెద్దగా వర్షాలు కురవడంలేదు. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటోంది... రాత్రి పొగమంచుతో పాటు మబ్బులు కమ్మేసి చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయట. ఇక ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, కరీంనగర్, జనగాం జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.