Prakasam Barrage
భారీ వర్షాలు, వరదలతో ఆంధ్ర ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. రెండుమూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... చెరువులు, జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. వరదనీటితో కృష్ణా నది చరిత్రలో ఎన్నడూలేని విధంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకీ 12 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఇప్పటివరకు ఈ బ్యారేజీకి వచ్చిన అత్యధిక వరద ఇదే ... ఇంకొంచే వరద ప్రవాహం పెరిగితే బ్యారేజీ పైనుండి నీరు వెళుతుంది.
ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులను దాటింది. 1903 ఓసారి, 2009 మరోసారి క్యూసెక్కులను దాటింది. కానీ ఇప్పుడు ఏకంగా 12 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుతోంది. ఇదే ఇప్పటివరకు అత్యధిక వరద నీరు.
గత రెండ్రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కృష్ణా నది ఎగువప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదనీరంతా కృష్ణానదిలో చేరడంతో ప్రమాదకర స్థాయికి ప్రవాహం చేరింది. దీంతో ప్రకాశం బ్యారేజీ పరిసరప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని గేట్లను పైకెత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు.
రంగంలోకి విపత్తు నిర్వహణ సంస్థ :
రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండుమూడు రోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు వంకల్లో మరింత వరదనీరు చేరుతుంది. కాబట్టి నీటి ప్రవాహాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. కాలువలు,కల్వర్టులతో పాటు మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని... అవసరం వుంటేనే ఇళ్లలోంచి బయటకు రావాలని సూచించారు.
Vijayawada
విజయవాడలో పరిస్థితి దారుణం :
భారీ వర్షాలతో విజయవాడ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఓవైపు కృష్ణా నది ఉగ్రరూపం... మరోవైపు బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడవాసులు భయంగుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇప్పటికే బుడమేరు విజయవాడను ముంచెత్తి పలువురి ప్రాణాలను బలితీసుకుంది.
వరద ప్రవాహం పెరిగి బుడమేరు కట్ట తెగిపోవడంతో వరదనీరు విజయవాడను ముంచెత్తింది. రాత్రికి రాత్రి విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు అప్రమత్తం అయ్యేలోపే వరదనీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మిగతావారు ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
తినడానికి తిండిలేదు... తాగడానికి నీరు లేదు... చుట్టుముట్టిన వరదనీటిలో అన్నీ మునిగిపోయాయి. దీంతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆకలితో అలమటించకుండా వుండేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారంతో పాటు అన్ని సౌకర్యాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించింది.
Vijayawada
వరదనీటిలో సీఎం చంద్రబాబు పర్యటన :
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్షాలు, వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎక్కడా ప్రాణనష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులందరికీ ప్రభుత్వం అండగా వుంటుందని హామీ ఇచ్చారు.
ఇక విజయవాడలో నీట మునిగిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. స్వయంగా పరిస్థితిని తెలుసుకుని బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఆహార పదార్థాలు, మంచినీటిని అందజేసారు. వరద ప్రవాహంలో గల్లంతయిన వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇలా సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపారు.
కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు. తెల్లవారుజామున మూడు గంటల వరకూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
Vijayawada
ఫలించిన చంద్రబాబు ప్రయత్నం :
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు పలించాయి. పరిస్థితిని వివరించి కేంద్ర సాయాన్ని కోరగా వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. ఈ బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు. పెద్దఎత్తున బోట్స్ రావడంతో ఇళ్లనుంచి బాధితులను బయటకు తీసుకువచ్చి పునరావాస కేంద్రాలకు తరలించారు.
సునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారంతో పాటు దుస్తులు కూడా అందించాలని చంద్రబాబు ఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్ ప్రతి ఒక్కరికీ అందాలని సూచించారు. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ఆహారం సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇంత పెద్ద ఇన్ ఫ్లో ఎప్పుడూ రాలేదు. 1998లో ఈ తరహా వరద వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం... గుంటూరు, విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వర్షం పడిందన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి వివరించినట్లు.... 10 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు, 10 హెలికాప్టర్లు
రాష్ట్రానికి వచ్చినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.