
Pawan Kalyan : పవన్ కల్యాణ్... ఇది పేరు కాదు ఓ బ్రాండ్. మెగా అభిమానులకు తారకమంత్రం. జనసైనికుల నినాదమిది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ గట్టిగా వినిపిస్తున్న పేరిది.
తన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పవర్ స్టార్ గా మారిన ఆయన రాజకీయాల్లో పవర్'ఫుల్' నాయకుడిగా మారారు. అభిమానులు పవనన్నా అని... నాయకులు పవన్ సార్ అని ఆప్యాయంగా పిలిచుకుంటారు. ఇది ఆయనపై వారికున్న అభిమానం.
తెలుగు ప్రజల అభిమాన నటుడు, పొలిటీషన్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఇవాళ(సోమవారం, సెప్టెంబర్ 2, 2024). ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, జనసైనికులే కాదు తెలుగు ప్రజలు భర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో ఓసారి గుర్తుచేసుకుందాం.
తన అన్న చిరంజీవికి అండగా ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించిన పవన్ వెనుకడుగు వేయకుండా అనుకున్నది సాధించారు. సొంతంగా జనసేన పార్టీని స్థాపించి కనీసం తనను తాను గెలిపించుకోలేకపోయిన స్థాయినుండి తానుమాత్రమే కాదు పోటీచేసిన అందరినీ గెలిపించుకునే స్థాయిలో ఆయన రాజకీయ ప్రస్ధానం సాగింది.
ప్రజారాజ్యం నుండి డిప్యూటీ సీఎం వరకు పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు, ఇంకొన్ని తీపి జ్ఞాపకాలు వున్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తొలి భర్త్ డే జరుపుకుంటున్నారు. ఇది ఆయనకే కాదు అభిమానులు, జనసైనికులకు ఎంతో ప్రత్యేకమైనది.
అయితే రాజకీయాల్లో ఈ స్థాయి ఆయనకు అంత ఈజీగా రాలేదు. అన్నవెంట రాజకీయాల్లో ప్రవేశించి, సొంతగా పార్టీ స్థాపించి... అవమానాలను భరిస్తూ, ప్రత్యర్థులతో పోరాడుతూ... రాజకీయ వ్యూహాలు రచిస్తూ, మిత్రులను దగ్గరకు చేర్చి... ఎన్నికల వేళ అన్నీతానై ప్రచారం చేసి, సమర్దవంతంగా ఎలక్షన్ మేనేజ్ మెంట్ చేసి... ఇలా దశాబ్దకాలంపాటు అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తేనే డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు పవన్ కల్యాణ్.
ప్రజారాజ్యం నుండి జనసేన వరకు రాజకీయ ప్రస్థానం :
పవన్ కల్యాణ్ పుట్టినరోజుకు ముందే 2008, ఆగస్ట్ 26న అన్న చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఈ క్రమంలోనే అన్నకు అండగా పవన్ కల్యాణ్ రాజకీయ రంగప్రవేశం చేసారు. ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసారు. ఇదే రాజకీయాల్లో పవన్ కు మొదటి అడుగు.
2009 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో భారీ అంచనాలతో పోటీచేసిన ప్రజారాజ్యం చతికిల పడింది. ఈ ఫలితంతో నిరాశచెందిన చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు... ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తిరిగి సినిమాలవైపు మళ్లారు.
అయితే పవన్ కల్యాణ్ చాలా మొండివాడు... అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టడు అంటుంటారు. అది నిజమేనని రాజకీయాల ద్వారా నిరూపించారు. అన్న వెనకడుగు వేసిన పవన్ మాత్రం రాజకీయాల్లో ముందుకు సాగారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి కొత్త అద్యాయానికి తెరలేపాడు.
జనసేన స్థాపన నుండి డిప్యూటీ సీఎం వరకు :
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వేళ జనసేన పార్టీని ఏర్పాటుచేసారు పవన్ కల్యాణ్. అన్న చిరంజీవిలా పార్టీ ఏర్పాటుచేసిన వెంటనే ఎన్నికలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేసారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టిడిపికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. కానీ పవన్ కల్యాణ్ ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టారు. లీడర్లు,క్యాడర్ ను తయారుచేసుకున్నాక సొంతంగా పోటీకి సిద్దమయ్యాయి.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో టిడిపి, జనసేన మధ్య ఓట్లు చీలిపోయి వైసిపి లాభపడింది. జనసేన పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటుకే పరిమితం అయ్యింది... పోటీచేసిన రెండు స్థానాల్లోనూ పవన్ కల్యాణ్ ఓడిపోయారు. దీంతో ఆయన పని అయిపోయింది... అన్న చిరంజీవిలాగే పార్టీని మూసేసుకుంటాడనే ప్రచారం జరిగింది.
2019 ఓటమి తర్వాత పవన్ కల్యాణ్ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితంపై వైసిపి నాయకులు తీవ్రస్థాయిలో కామెంట్స్ చేసారు. ఆయన మూడు పెళ్లిళ్లను రాజకీయాల్లోకి లాగారు. కానీ అది తన వ్యక్తిగత విషయమని ... ఎందుకలా పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ పవన్ కౌంటర్ ఇచ్చారు.
జనసేన నాయకులు సైతం వైసిపి నాయకుల్లా తమ నాయకుడు వ్యవహరించలేదని... చట్టబద్దంగా విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నాడంటూ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని గుర్తుచేస్తూ వైసిపిని ఇరకాటంలో పెట్టారు.ఇలా పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని అనుకున్న వైసిపికి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ సమయంలోనే పవన్ మొండితనం మరోసారి బయటపడింది. ఎన్నో అవమానాలు, మరెన్నో ఒడిదుడుకులు దాటుకుని జనసేన పార్టీని కొనసాగించారు. ఐదేళ్ల వైసిపి పాలనలో జనసేన తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు.
2024 ఎన్నికలను పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. గత ఎన్నికల అనుభవం దృష్ట్యా టిడిపి, జనసేన పార్టీలు కలిసి పనిచేసేలా చొరవ తీసుకున్నారు... ఈ రెండింటిని ఎన్డిఏలో భాగస్వామ్యం చేసారు. ఇలా టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పాటులో పవన్ దే కీలకపాత్ర.
తన సీట్లను తగ్గించుకున్నాడు కానీ కూటమి విచ్చిన్నానికి అవకాశం ఇవ్వలేదు పవన్ కల్యాణ్. మూడు పార్టీల కలయిక ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. 175 సీట్లకుగాను 164 సీట్లను గెలుచుకుని కూటమి అధికారాన్ని చేపట్టింది.
పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వైసిపి నాయకులకు మాటలతో కాదు... భారీ విజయంతోనే జవాభిచ్చారు. పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ తో దూసుకెళ్లారు. రాజకీయాల్లో చాలా అరుదైన రికార్డును పవన్ సాధించారు.
కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కు ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు దక్కాయి. సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత స్థానం ఆయనకే దక్కింది... ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టారు.
ఇలా రాజకీయాలకు పనికిరాడన్న ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ పవర్ స్టార్ కాస్త ఉపముఖ్యమంత్రిగా మారారు. డిప్యూటీ సీఎంగా ఆయనకు ఇది మొదటి భర్త్ డే... దీంతో 'హ్యాపీ భర్త్ డే డిప్యూటీ సీఎం సాబ్' అంటూ విషెస్ చెబుతున్నారు తెలుగు ప్రజలు.