
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఏం చేసినా ప్రజలకు నచ్చేలా, ప్రతి ఒక్కరు మెచ్చేలా వుంటున్నాయి. అలాగని ఆయన టైం అలా నడుస్తుంది అనుకోడానికి లేదు... ప్రజల కోణంలో ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆయనేం చేసినా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్టైక్ రేట్ నుండి తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం తీసుకున్న నిర్ణయం వరకు పవన్ కల్యాణ్ ఏం చేసినా ప్రజల్లోకి బలంగా వెళుతోంది. సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఆయన క్రేజ్ అంతకంతకు పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు.
నిన్న(గురువారం) అటవీ శాఖ మంత్రి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు స్వయంగా కర్ణాటకకు వెళ్లారు పవన్. చిత్తూరు, పార్వతీపురం వంటి జిల్లాల్లో ఏనుగులు ఊళ్లు, పంటపొలాలపై పడి భీభత్సం సృష్టించకుండి కుంకీ ఏనుగులను ఇచ్చేలా కన్నడ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఇలా రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్న పవన్ ఇంకా ప్రశంసలు కురుస్తూనే వున్నాయి... అంతలోనే పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారాయన. దీంతో అటవీ శాఖ మంత్రితో పంచాయితీరాజ్ శాఖ మంత్రిపై ప్రశంసల వెల్లువ మొదలయ్యింది.
ఇంతకూ పవన్ తీసుకున్న నిర్ణయమేంటి ?
ఆగస్ట్ 15 దగ్గరపడుతోంది... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్దమవుతోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ను ఇది మొదటి స్వాతంత్య్ర వేడుకలు. అందుకేనేమో చిరకాలం గుర్తుండిపోయేలా... ఇంతకాలం ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం గ్రామ పంచాయితీలకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం కేవలం రూ.100, రూ.250 ఇచ్చేది ప్రభుత్వం... కానీ ఈసారి అలా కాకుండా రూ.10,000, రూ.25,000 వేల రూపాయలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పంచాయితీరాజ్ అధికారులను ఆదేశించారు.
ఇటీవల పంచాయితీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను పలువురు గ్రామ సర్పంచులు కలిసారు. ఈ సందర్భంగా పంచాయితీలకు నిధుల కొరత గురించి ఆయనకు తెలియజేసారు. పంచాయితీ పాలకవర్గాల పరిస్ధితి ప్రస్తుతం ఎలావుందంటే... త్వరలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించడానికి నిధులు లేవని పవన్ కు తెలిపారు. వారు తమ సమస్యను తెలియజేసేందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉదహరించి వుంటారు... కానీ పవన్ కల్యాణ్ మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ప్రభుత్వం పంచాయితీలకు ఉన్ని నిధులిస్తుందో తెలుసుకుని పవన్ ఆశ్చర్యపోయారు. గత 34 ఏళ్లుగా మైనర్ గ్రామపంచాయితీలకు రూ.100, మేజర్ గ్రామ పంచాయితీలకు రూ.250 మాత్రమే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అందిస్తోందని అధికారులు తెలిపారు. దీంతో వెంటనే ఆ మొత్తాన్ని భారీగా పెంచాలని పంచాయితీరాజ్ అధికారులను ఆదేశించారు.
2011 జనాభా లెక్కలప్రకారం ఇప్పటివరకు 5 వేలోపు జనాభా వున్న గ్రామపంచాయితీలకు రూ.100 ఇస్తే ఈసారి రూ.10,000 ఇవ్వాలని... 5 వేలకు పైగా జనాభా వున్న గ్రామ పంచాయితీలకు రూ.250 ఇస్తే ప్రస్తుతం రూ.25,000 ఇవ్వాలని పవన్ ఆదేశించారు. ఇలా ప్రతి గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు. ఒక్క స్వాతంత్య్ర దినోత్సవానికే కాదు గణతంత్ర దినోత్సవానికి కూడా ఇలాగే నిధులు అందిస్తామని మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు.
ఇక భారీగా నిధులు పెంచి చేతులు దులుపుకోకుండా జాతీయ దినోత్సవాల రోజున జెండా పండగను ఎలా నిర్వహించాలో మార్గదర్శకాలను కూడా నిర్దేశించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దేశభక్తి గురించి తెలిసేలా వుండాలన్నారు.
స్వాతంత్య్ర విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలని పవన్ సూచించారు. ఆటల పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలన్నారు. బహుమతులు అందించాలిని పవన్ సూచించారు.
ఇక పంచాయతీ పరిధిలోని స్వతంత్ర సమరయోధులు, రక్షణ రంగం నుంచి వచ్చివారు, పారిశుధ్య కార్మికులను సత్కరించాలని సూచించారు పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు మిఠాయిలు లేదా చాక్లెట్లు అందించాలన్నారు పారిశుధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని పవన్ కల్యాణ్ సూచించారు.