సర్పంచి సంతకం ఫోర్జరీ.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

First Published | Jul 25, 2024, 12:58 AM IST

సర్పంచులను నామమాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తమ ప్రభుత్వంలో పంచాయతీలను కచ్చితంగా బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.

Deputy CM Pawan Kalyan

సర్పంచులను నామమాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తమ ప్రభుత్వంలో పంచాయతీలను కచ్చితంగా బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు గ్రామ సర్పంచి బూదూరు లక్ష్మి బుధవారం పవన్‌ కళ్యాణ్‌ను కలిశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వైసీపీ నాయకులు తనను బెదిరించి, కుల దూషణలు చేయడంతో పాటు తన సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారు. 

రాష్ట్ర అసెంబ్లీలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్‌ను మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ముత్తుకూరు సర్పంచి లక్ష్మి కలిశారు. తనకు ఎదురైనా ఇబ్బందులు, అవమానాలను వివరించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనపై వైసీపీ నాయకులు, ఉప సర్పంచి, పంచాయతీ కార్యదర్శి కుల దూషణకి పాల్పడుతున్నారని, ఊరి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు తెలిపారు.

సర్పంచి ఫిర్యాదుపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... ఆమెపై వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి సంతకాలు చేయించిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సంతకాలు ఫోర్జరీపై విచారణ చేపడతామని సర్పంచి లక్ష్మికి హామీ ఇచ్చారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళా సర్పంచి పట్ల కుల దూషణలకి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారని పవన్‌ కళ్యాణ్ చెప్పారు. 

పవన్ కళ్యాణ్‌తో బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన భేటీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌తో బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు, వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ అయిన బేబి నాయన పలు జాతీయ పార్కుల్లో తాను తీసిన వన్యప్రాణుల ఫొటోలను పవన్ కళ్యాణ్‌కు బహూకరించారు. అందులో బాంధవగఢ్ జాతీయ పార్కు, తడోబా జాతీయ పార్కు, కన్హా జాతీయ పార్కుల్లో తీసిన పెద్ద పులులు, ఇతర వన్య ప్రాణుల ఫొటోలు ఉన్నాయి.  పవన్ కళ్యాణ్ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ ఫొటోలు అందజేశారు. రాష్ట్రానికి వన్యప్రాణి పర్యాటకాన్ని పరిచయం చేయాలని, పెద్ద పులుల సంరక్షణ చేపట్టాలని ఈ సందర్భంగా బేబినాయన కోరారు. ఈ సూచన పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. త్వరలో నిర్వహించే అంతర్జాతీయ పులుల దినోత్సవ కార్యక్రమానికి రావాలని బేబి నాయనను ఆహ్వానించారు.
 

Latest Videos

click me!