Nara Chandrababu Naidu : పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సక్సెస్ అయ్యింది. పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసి ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ తో భారత్ చిన్నసైజు యుద్దమే చేయాల్సి వచ్చింది. దాయాది దేశం మిస్సైల్స్, డ్రోన్ దాడులకు తిప్పికొట్టిన భారత్ ఎదురుదాడికి దిగి పాక్ కు గట్టిగానే షాకిచ్చింది. ఇలా ఉగ్రవాదం, పాకిస్థాన్ కు ఒకేసారి ధీటుగా జవాబిచ్చిన భారత విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి పార్టీలు (టిడిపి, జనసేన, బిజెపి) కూడా తిరంగ ర్యాలీని నిర్వహించాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి జాతీయ జెండాలు చేతబట్టి ముందునడవగా పార్టీల నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వెనక నడిచారు. ఇలా తిరంగ ర్యాలీలో మూడు కిలోమీటర్ల దూరం సాగింది.