
Roja Selvamani : ప్రముఖ హీరోయిన్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి శ్రీలతా రెడ్డి... అంటే ఎవరో తెలియడంలేదు కదా. అదే ఆర్కె రోజా అంటే... హీరోయిన్, మాజీ మంత్రి పదాలు వాడకున్నా గుర్తుపడతారు. సినిమా రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఫైర్ బ్రాండ్ రోజా. అయితే శ్రీలతా రెడ్డి కాస్త రోజాగా మారడంవెనకున్న ఆసక్తికర స్టోరీ... ఆమె జీవితాన్ని మార్చేసిన ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం.
చిత్తూరు జిల్లా బాకరావుపేటకు చెందిన నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు 1972 నవంబర్ 17న ఓ ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు శ్రీలతా రెడ్డి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే సినిమారంగంపై ఆసక్తితో నాగరాజు రెడ్డి హైదరాబాద్ కు కుటుంబంతో సహా షిప్ట్ అయ్యాడు... సారథి స్టూడియోలో పని చేసేవాడు. ఇలా సినిమా రంగానికి దగ్గరైన ఈ కుటుంబానికి చెందిన శ్రీలతా రెడ్డి ఊహించని విధంగా సినీ నటిగా మారింది... హీరోయిన్ రోజాగా గుర్తింపు పొందింది.
రోజా డిగ్రీ చదువుతుండగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాల్య స్నేహితుడు, సినీ దర్శకుడు శివప్రసాద్ కంటపడింది రోజా. వెంటనే తాను డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ప్రేమ తపస్సు సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ఇలా రాజేంద్ర ప్రసాద్ సరసన హీరోయిన్ గా మొదటిసినిమాలో నటించారు రోజా... ఈ మూవీ 1991 లో విడుదలయ్యింది.
వాస్తవానికి రోజాకు నటన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో శివప్రసాద్ ఆఫర్ ను మొదట రిజెక్ట్ చేయాలనుకుంట. కానీ తండ్రి నచ్చజెప్పడంతో ఒక్క సినిమాలో నటించేందుకు అంగీకరించింది. ఇలా తండ్రి మాటకు ఎదురు చెప్పలేక సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకున్నారు... యాక్సిడెంటల్ గా హీరోయిన్ గా మారారు రోజా.
అయిష్టంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఒకటి తర్వాత ఒకటిగా వరుసపెట్టి అవకాశాలు రావడంతో ఒక్క సినిమాతో ఆపేద్దామనుకున్న కెరీర్ నే కొనసాగించారు... హీరోయిన్ గా స్థిరపడిపోయారు. అనేక హిట్ సినిమాల్లో నటించి గొప్ప హీరోయిన్ గా గుర్తింపుపొందారు.
అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే రోజాను సినిమాలకు, రాజకీయాలకు పరిచయం చేసింది ఒకే వ్యక్తి... ఆయనే శివప్రసాద్. తన స్నేహితుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఉన్నతస్థానంలో ఉండటంతో శివప్రసాద్ సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చారు... ఈ క్రమంలోనే టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన రోజాతో ప్రచారం చేయించారు. ఆమె వాగ్దాటి, పాపులారిటీని చూసి ఇంప్రెస్ అయిన చంద్రబాబు రాజకీయాల్లోకి ఆహ్వానించారు... 2004 లో నగరి నుండి పోటీ చేయించారు. ఇలా యాక్సిడెంటల్ గా రాజకీయాల్లోకి వచ్చారు రోజా.
మొదటిసారి నగరి నుండి పోటీచేసిన రోజా ఓటమిపాలయ్యారు. టిడిపి తరపున పోటీ చేసిన ఈమె కాంగ్రెస్ అభ్యర్థి జంగారెడ్డి చేతిలో 6000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈ ఓటమితో ఆమె వెనకడుగు వెయ్యలేదు... నగరిలోనే ఉంటూ రాజకీయాలపై పట్టు సాధించింది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విమర్శస్త్రాలను సంధించేది... సినీ నటి కావడంతో ఆమెపై మీడియా ఫోకస్ కూడా ఎక్కువగా ఉండేది. దీంతో నటి రోజా కాస్త పోలిటికల్ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు.
2011లో వైఎస్ జగన్ పార్టీ పెట్టడంతో వైసీపీలో చేరారు రోజా.... జగన్ తో కలిసి పనిచేశారు. అనతికాలంలోనే వైసీపీలో రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎదిగారు. 2014లో నగరి నియోజకవర్గ నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 67 సీట్లు రావడంతో జగన్ సీఎం కాలేకపోయారు. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రోజా గెలవడం, వైసిపి అధికారంలోకి రావడం జరిగింది. దీంతో జగన్ కేబినెట్ లో ఆమె మంత్రిగా పనిచేశారు.
ఇలా రోజాను సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు రోజా. అయితే తనను సినిమాలు, రాజకీయాలకు పరిచయం చేసిన శివప్రసాద్ ను రాజకీయ గురువుగా భావిస్తుంటారామె. ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నానని పలు సందర్భాల్లోనూ రోజా చెప్పారు.