Tomato Price : పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మినట్లు తయారయ్యింది టమాటా రైతుల పరిస్థితి. గతంలో కేవలం ఒక్క టమాటా 10 రూపాయలు (కిలో రూ.150 నుండి రూ.200) పలికిన మర్కెట్ లోనే ఇప్పుడు కిలో రూపాయి రెండు రూపాయలు పలుకుతోంది. కేవలం ఒక్క ఎకరా టమాటా పంటవేసి లక్షలు సంపాదించినవారు ఉన్నాయి... ఇప్పుడు ఏకంగా 10, 20 ఎకరాల్లో టమాటా పండించిన రైతులు సైతం కనీసం పది ఇరవై వేలు కళ్లజూసే పరిస్థితి లేదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజుల కింద ఆకాశాన్నంటిన టమాటా ధర ఇప్పుడు అధ:పాతాళానికి పడిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో టమాటా పంటకు ప్రసిద్దిగాంచిన ప్రాంతం మదనపల్లి. అక్కడి రైతుల ప్రధాన పంట టమాటానే... ఇతర ప్రాంతాలనుండి కూడా ఈ మార్కెట్ కు టమాటా తరలిస్తారు. ఇక్కడినుండే ఏపీలోని మిగతా ప్రాంతాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక,ఒడిషా, తమిళనాడు, పాండిచ్చెరి ప్రాంతాలకు కూడా టమాటా ఎగుమతి అవుతుంది. అలాంటి మార్కెట్ లో కిలో టమాటా రూ.5 కంటే ఎక్కువ ధర పలకడం లేదు. దీంతో కనీసం రవాణాచార్జీలు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఒక్క మదనపల్లె మార్కెట్ లోనే కాదు రాష్ట్రంలోని అన్నిచోట్ల ఇలాగే ఉంది టమాటా రైతుల పరిస్థితి. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులకు సాయం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టమాటా రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది.