చంద్రబాబు అరెస్టు: బాలక్రిష్ణ చేతుల్లోకి టిడిపి, జూ.ఎన్టీఆర్ దూరమే

First Published | Sep 12, 2023, 10:53 AM IST

 పార్టీ నాయకులతో ఆయన సమావేశమవుతున్నప్పటికీ ఎక్కువగా కోర్టు వ్యవహారాలనే ప్రధానంగా చూసుకునే అవకాశం ఉంది. నారా లోకేష్ తన పాదయాత్రను ఆపేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారం సమీపంలోనే ఆయన ఉంటున్నట్లు సమాచారం.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టయిన నేపథ్యంలో పార్టీని నడిపించేందుకు నందమూరి హీరో బాలక్రిష్ణ రంగంలోకి దిగారు. పార్టీ వ్యవహారాలను అన్నింటినీ ఆయనే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో టిడిపి నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించి, కార్యాచరణను రూపొందించి అమలు చేసే బాధ్యతలను ఆయన తీసుకున్నట్లు చెబుతున్నారు.

బాలక్రిష్ణ తన సినిమా షూటింగ్ లు రద్దు చేసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, చంద్రబాబు అరెస్టు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో బాలక్రిష్ణ టిడిపి వ్యవహారాలను చూడడానికి ముందుకు రావడంతో ఆ సినిమా షూటింగ్ సకాలంలో పూర్తవుతుందా, లేదా అనేది చూడాల్సిందే. బాబీ దర్శకత్వంలో బాలక్రిష్ణ మరో సినిమాను ప్రకటించారు. అదింకా సెట్స్ లోకి వెళ్లలేదు


చంద్రబాబు కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్కువగా కోర్టు వ్యవహారాలను చూసే బాధ్యతను భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులతో ఆయన సమావేశమవుతున్నప్పటికీ ఎక్కువగా కోర్టు వ్యవహారాలనే ప్రధానంగా చూసుకునే అవకాశం ఉంది. నారా లోకేష్ తన పాదయాత్రను ఆపేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారం సమీపంలోనే ఆయన ఉంటున్నట్లు సమాచారం.

ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో జైలుకు వెళ్లినప్పుడు పార్టీ కార్యక్రమాలను ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ నిర్వహించారు. షర్మిల పాదయాత్ర కూడా చేశారు. అలాగే ప్రస్తుతం చంద్రబాబు సతీమణి, ఆయన కోడలు బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. వారు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో పార్టీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్నప్పటికీ వారిద్దరు రాజకీయాల్లోకి రారనే మాట వినిపిస్తోంది

చంద్రబాబు అరెస్టుపై నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయన పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. కానీ ఆయన దూరంగానే ఉండదలుచుకున్నట్లు అర్థమవుతోంది. సినిమాలు చేయడంలో ఆయన బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి తనకు సినిమాలు తప్ప మరేదీ పట్టనట్లుగా ఉన్నారు.

మొత్తం మీద, చంద్రబాబు అరెస్టుతో టిడిపి సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నట్లే చెప్పవచ్చు. చంద్రబాబు అరెస్టు పరిణామాలు, పార్టీపై దాని ప్రభావం ఎలా ఉంటాయనే విషయం మీదనే టిడిపి నేతలు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో టిడిపి క్యాడర్ తీవ్రమైన నిరాశకు, నిస్సహాయతకు గురైనట్లు భావిస్తున్నారు. టిడిపి శ్రేణులకు నైతిక బలాన్ని చేకూర్చే బాధ్యతను బాలక్రిష్ణ స్వీకరించినట్లు తెలుస్తోంది. 

Latest Videos

click me!