అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతుల ఆందోళన 21వ, రోజుకు చేరుకొంది. రాజధానిని అమరావతి నుండి మార్చితే తమకు నష్టం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాజదానిని మార్చితే తమకు కలిగే నష్టాన్ని ఎవరు పూడ్చుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలోని ఉద్దండరాయినిపాలెం వద్ద రాజధానికి శంకుస్థాపన చేశారు. రాజధాని కోసం రైతుల నుండి అప్పటి ప్రభుత్వం 35వేలకు పైగా ఎకరాల భూమిని సేకరించింది.
రాజధాని విషయమై జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నివేదికలు సమర్పించారు. ఈ రెండు నివేదికలపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీ అధ్యయనం చేయనుంది. హైలెవల్ కమిటీ తొలి సమావేశం ఈ నెల 7వ తేదీన అమరావతిలో సమావేశం కానుంది.హైలెవల్ కమిటీ ఈ నెల 20వ తేదీలోపుగా రిపోర్టును సీఎం జగన్‌కు అందించనుంది. అమరావతిపై జగన్ సర్కార్ త్వరలోనే తేల్చనుంది.
అమరావతి నుండి రాజధానిని మార్చితే తమకు తీవ్ర నష్టమనే అభిప్రాయంతో స్థానికులు ఉన్నారు. రాజధాని వస్తోందనే ఉద్దేశ్యంతో ఈ ప్రాంతానికి చెందిన రైతులు భూములు ఇచ్చారు. అన్ని పార్టీలకు చెందిన రైతులు భూములు ఇచ్చారు. భూముల సేకరణ సమయంలో స్థానిక రైతుల నుండి బలవంతంగా తీసుకొన్నారని అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం అమరావతి నుండి రాజధానిని మార్చితే తమ భూముల విలువ తగ్గిపోయే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి సేకరించిన భూములను కొన్నింటిని తిరిగి ఇచ్చేయాలనే యోచనలో సర్కార్ ఉంది.
అయితే ప్రభుత్వం నుండి తిరిగి భూములు తీసుకొన్న కూడ తమకు ఏం ప్రయోజనమని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూములను సేకరించారు. అయితే ఈ భూములను తాము తిరిగి తీసుకొన్నా కూడ ఏం చేసుకొంటామని ప్రశ్నిస్తున్నారు. రాజధానిని విశాఖకో ఇతర ప్రాంతానికి తరలిస్తే తాము భూములు తీసుకొన్న ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు.
అమరావతి పరిరక్షణ జేఎసీగా రైతులు ఏర్పడి ఆందోళనలు చేస్తున్నారు. విపక్షాలు అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలిచారు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ, సీపీఎం మధు తదితరులు ఈ దీక్షలకు మద్దతుగా నిలిచారు.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా రూ. 50 వేలను కౌలు కింద చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా కౌలును పెంచుతామని చంద్రబాబునాయుడు సర్కార్ ానాడు రైతులకు హామీ ఇచ్చింది. పదేళ్లపాటు కౌలును రైతులకు చెల్లించనున్నారు..
రాజధాని ప్రాంతంలోనే ప్లాట్లు కూడ ఇవ్వాలని కూడ నిర్ణయం తీసుకొంది. అయితే రాజధాని లేకుండా ప్లాట్లు, భూములను తిరిగి తీసుకోవడం వల్ల తమకు ఏం ప్రయోజనమని రైతులు ప్రశ్నిస్తున్నారు.