Rain Alert: దిత్వా తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అనుకున్నంత పడలేదు. అయితే తుపాను బలహీనంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంతో డిసెంబర్ 3 బుధవారం ఆంధ్ర తీర ప్రాంతాల్లో వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం సముద్ర తీరానికి ఉన్న సమీప ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
25
నెల్లూరు–తిరుపతిలో భారీ వర్ష సూచన
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి(జి) మల్లం ప్రాంతంలో 53.5 మిమీ, తడలో 50.7 మిమీ, చిత్తమూరు వద్ద 50.2 మిమీ, పూలతోట ప్రాంతంలో 33.5 మిమీ వర్షపాతం నమోదైంది.
35
కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
వాయుగుండం ప్రభావం తెలంగాణపై ప్రస్తుతం లేదని వాతావరణ అధికారులు స్పష్టంచేశారు. రాష్ట్రంలో వచ్చే రెండు మూడు రోజులు పరిస్థితి సాధారణంగా కొనసాగుతుందని అంచనా వేశారు. భారీ వర్షాల సూచనలు లేవని అధికారులు తెలిపారు.
55
హైదరాబాద్‌లో స్వల్ప పొగమంచు
డిసెంబర్ 8 వరకు హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామున స్వల్ప పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయాల్లో ఆకాశం మబ్బులతో నిండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.