AP High Court: పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అంశంపై వైసీపీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదేంటో చూసేద్దాం.
పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల నిర్మాణంపై రాజకీయ వివాదం రాజుకుంది. పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్(పీపీపీ)లో పలు మెడికల్ కాలేజీలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ.. హైకోర్టు మెడికల్ కాలేజీల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం పిలిచిన టెండర్లపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది.
25
వైసీపీ వ్యతిరేకం..
పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నిరసనగా విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు గురువారం రోడ్డు షో నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు పరోక్షంగా ఆయన వైఖరిని తప్పుబడుతూ.. ప్రభుత్వాన్ని సమర్ధించింది. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మిస్తే తప్పేంటని ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి చీమలపాటి రవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
35
అలా నిర్మిస్తే తప్పేంటి.?
'నిధుల కొరత కారణంగా ప్రభుత్వం ఈ పీపీపీ విధానాన్ని ఎంచుకుంటే, దానిలో తప్పేంటి.?' రాష్ట్రంలో పూర్తిగా ఆస్పత్రులు, కళాశాలలు సొంతంగా నిర్మించాల్సి వస్తే.. దానికి సంవత్సరాలు పట్టొచ్చు. ప్రభుత్వ-ప్రైవేటు భావస్వామ్యం ఓ ఆచరణాత్మక పరిష్కారం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రుణాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ బ్యాంకులను సంప్రదించలేదని.. నిధుల కొరత కారణంగా అనేక జిల్లా కోర్టు సముదాయాలు అసంపూర్ణంగా ఉన్నాయని తెలిపింది.
పూర్తి ప్రైవేటీకరణ కంటే ఇలా పీపీపీ మోడల్ ప్రభుత్వ భాగస్వామ్యం జవాబుదారీతనాన్ని, ప్రజా పర్యవేక్షణ ఉండేలా చేస్తుందని కోర్టు పేర్కొంది. అందుకే ఈ పద్దతి వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ ప్రక్రియపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. సెప్టెంబర్ 9, 2025న జారీ చేసిన ప్రభుత్వ జీవో. 590ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన డాక్టర్ కుర్రా వసుంధర దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ప్రతిస్పందనగా ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
55
జీవో వివరాలు ఇవే..
పీపీపీ పద్దతిలో ఆదోని, మదనపల్లె, మార్కాపూర్, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలలో కొత్త వైద్య కళాశాలల స్థాపనకు కూటమి ప్రభుత్వం జీఓకు ఆమోదం తెలిపింది. కాగా, ఈ పిటిషన్‌పై ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్లను డీటెయిల్డ్ కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను అక్టోబర్ 29కు వాయిదా వేసింది.