Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈనెల మొత్తం ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచనలను బట్టి అర్ధమవుతోంది. ఇవాళ ఏఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటే…
Rain Alert : అక్టోబర్ వచ్చిందంటే వర్షాకాలం ముగిసినట్లే... శీతాకాలం ప్రారంభం అయినట్లే. ఇప్పటికే నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కూడా స్పీడ్ గా సాగుతోంది. అయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు... ఫినిషింగ్ టచ్ గా మరోసారి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది... ఇది అల్పపీడనంగా మారడంతో అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇలా మరికొన్ని రోజులు వర్షాలు తప్పవని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగు రాష్ట్రాలు వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి.
26
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (అక్టోబర్ 10, శుక్రవారం) అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు. మోస్తరు వర్షాలే కురిసినా ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు తోడయి ప్రమాదకరంగా మారతాయని తెలిపారు.
36
ఏపీలో సడన్ రెయిన్స్
రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో కమ్మేసి సడన్ గా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని తెలిపింది APSDMA. పిడుగులు పడటం, ఈదురుగాలులు వీయడంవల్ల వర్షసమయంలో చెట్లకింద ఉండేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి... కాబట్టి సామాన్య ప్రజలు మరీముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పాడిపశువులు, ఇతర మూగజీవాలను చెట్లకింద ఉంచరాదని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
ఏపీకి పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉందని విపత్తు సంస్థ హెచ్చరికలను బట్టి అర్థమవుతోంది. కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు వంటి జిల్లాలకు అయితే పిడుగుపాట్ల హెచ్చరికల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
56
నేడు తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో కూడా ఇవాళ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
66
కుండపోత వర్షం
ఇక గురువారం సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. మహబూబ్ నగర్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీటమునిగాయి. అలాగే నవాబుపేట, దేవరకద్రలో కూడా అతిభారీ వర్షం కురిసింది... వరదనీటితో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం సాయంత్రం నుండి రాత్రివరకు 4 నుండి 5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. నారాయణపేటలో ఓ మహిళ పొలంవద్ద పిడుగుపాటుకు గురయి మరణించింది.