Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలో తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ ప్రకటనకు ప్రత్యేక ముహూర్తాన్ని ఖరారు చేశారు. నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రజలు, యువత తమ కొత్త రాజకీయ ప్రయాణానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పార్టీ పేరు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
24
రెండు పార్టీల రాజకీయాలకు ప్రత్యామ్నాయమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, రెండు కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కులం, మతం ఆధారంగా జరిగే రాజకీయాలకు బదులుగా ప్రజల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలు లేని రాష్ట్రాన్ని నిర్మించాలన్నది తన ఆలోచనగా వివరించారు. కరువు, విద్యుత్ కోతలు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే విధంగా కొత్త పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. ఇవన్నీ ఆయన వెల్లడించిన రాజకీయ లక్ష్యాలు కాగా, వాటి అమలుకు సంబంధించిన పూర్తి ప్రణాళిక ఇంకా తెలియాల్సి ఉంది.
34
రైతులకు సాగునీరు.. యువతకు ఉద్యోగాలు
కొత్త పార్టీ ఎజెండాలో వ్యవసాయం, విద్యుత్, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని విజయసాయిరెడ్డి వివరించారు. ప్రతి ఎకరానికి ఏడాదికి రెండు పంటలకు సరిపడా నీరు అందించడం, ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ అందించే దిశగా చర్యలు తీసుకోవడం తమ లక్ష్యాలని తెలిపారు. విద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు పెరిగేలా, వారి ఖర్చుల భారం తగ్గేలా విధానాలు రూపొందిస్తామని వెల్లడించారు. యువతను నాయకత్వంలోకి తీసుకురావడంతో పాటు కొత్త తరం రాజకీయ నాయకులను తయారు చేసే వేదికగా పార్టీని తీర్చిదిద్దాలన్న ఆలోచనను కూడా ఆయన ప్రస్తావించారు.
విజయసాయిరెడ్డి గతంలో కొత్త పార్టీ ప్రకటనను వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు. అనారోగ్య కారణాలతో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నందున ప్రకటనకు సమయం పట్టిందని ఆయన అప్పట్లో తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటుపై ఆయన వెనక్కి తగ్గారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగినప్పటికీ, తాను ఆ ప్రయత్నాన్ని విరమించుకోలేదని స్పష్టం చేశారు. తాజాగా దసరా సందర్భంగా పార్టీ ఆవిర్భావ తేదీని ప్రకటించడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి పెరిగింది. నవంబర్ 11 తేదీ, 11 గంటల 11 నిమిషాల సమయాన్ని ఎంచుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 11 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో, ఈ సంఖ్య ఎంపికపై చర్చ నడుస్తోంది.