ఆంధ్రప్రదేశ్ లిక్కస్ స్కామ్ కేసు సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వానికి సుమారు రూ.4,000 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు అమల్లో ఉన్న కొత్త మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రముఖ బ్రాండ్లను పక్కన పెట్టి, కొత్త లేదా నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారనీ, 15–20 శాతం కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. ఆటోమేటెడ్ సిస్టమ్‌ను రద్దు చేసి మాన్యువల్ ఆమోదాలను అమలు చేయడం వల్ల అక్రమాలకు అవకాశం లభించిందని సిట్ ఛార్జీషీట్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కస్ స్కామ్ తాజా దర్యాప్తు విషయాలు
ఈడీ దర్యాప్తులో నిందితులు ప్రముఖ బ్రాండ్ల ఆర్డర్లను అడ్డుకున్నట్లు, డిస్టిలరీలకు చెల్లించాల్సిన బిల్లులు నిలిపివేసినట్లు తేలింది. అక్రమ కమీషన్ల కోసం ఒత్తిడి తెచ్చినట్లు కూడా బయటపడింది. APSBCL నుండి సరఫరాదారులకు చెల్లించిన కొంత మొత్తం నకిలీ సంస్థలకు బదిలీ అయ్యింది. ఈ లావాదేవీలు వాస్తవానికి లేవని, పలు నకిలీ కంపెనీలు, షెల్ సంస్థలు నిధుల తరలింపుకు వాడినట్లు ఈడీ పేర్కొంది. బంగారం కొనుగోలు చేసి నగదు రూపంలో నిందితులకు అందించినట్లు కూడా ఆధారాలు లభించాయి.
సీఐడీ 2024 జూలైలో దాఖలు చేసిన ఛార్జీషీట్ ప్రకారం.. మాజీ ఐటీ సలహాదారు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వైసీపీ నేత, ఎంపీ పి.వి. మిధున్ రెడ్డి ఈ స్కాం ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. వీరిద్దరూ అరెస్టు అయ్యారు. రూ.11 కోట్లు నగదు, మద్యం సీసాలు కూడా శంషాబాద్‌లోని ఒక ఫార్మ్ హౌస్‌లో స్వాధీనం చేసుకున్నారు. 30కి పైగా షెల్ కంపెనీల ద్వారా డబ్బును దుబాయ్, ఆఫ్రికాలో భూములు, బంగారం, లగ్జరీ ఆస్తులు కొనుగోలు చేసేందుకు వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.