Andhra pradesh: ఒకప్పుడు కరవు, వలసలతో వార్తల్లో నిలిచిన రాయలసీమ ఇప్పుడు బంగారం ఉత్పత్తి కేంద్రంగా కొత్త గుర్తింపు పొందబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో భారీ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది.
ఇప్పటివరకు దేశంలో బంగారు గనులు అంటే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) పేరు ఎక్కువగా వినిపించేది. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి కూడా చేరబోతోంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన తర్వాత, ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని కేటాయించింది. మొత్తం 1,500 ఎకరాల విస్తీర్ణంలో గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు చేపట్టనుండగా, తొలి దశలో సుమారు 600 ఎకరాల్లో తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ దేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అవుతున్న అతిపెద్ద బంగారం వెలికితీత ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది.
25
రూ.405 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్
జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. ఇందుకోసం సుమారు రూ.405 కోట్ల పెట్టుబడిని పెట్టాయి. బంగారు ఖనిజాన్ని వెలికితీసి శుద్ధి చేయడానికి ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. గనుల నుంచి తీసిన ఖనిజాన్ని శుద్ధి చేసి స్వచ్ఛమైన బంగారంగా మార్చే ప్రక్రియ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన నీటి సరఫరా కోసం హంద్రీ-నీవా సుజల స్రవంతి నుంచి సుమారు 18 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నీటిని తరలించే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
35
దశలవారీగా పెరగనున్న బంగారం ఉత్పత్తి
జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తిని దశల వారీగా పెంచేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి ఏడాదిలో సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత రెండో దశలో ఉత్పత్తిని 900 కిలోల వరకు పెంచనున్నారు. భవిష్యత్తులో ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని మరింత విస్తరించి, ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేసే స్థాయికి ఈ ప్రాజెక్టును తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో జొన్నగిరి దేశంలోని ప్రధాన బంగారం ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం బంగారం మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా గణనీయమైన ఆదాయం సమకూరనుంది. గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం విలువలో 4 శాతం రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. ప్రారంభ దశలో 400 కిలోల బంగారం ఉత్పత్తి ద్వారా సుమారు రూ.57 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఉత్పత్తి 900 కిలోలకు పెరిగినప్పుడు ఈ రాయల్టీ ఆదాయం రూ.144 కోట్ల వరకు చేరే అవకాశముంది. అదే సమయంలో ప్రాజెక్ట్ ద్వారా సుమారు 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరోక్షంగా రవాణా, సేవలు, ఇతర అనుబంధ రంగాల్లో మరెందరికో ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.
55
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్లాంట్ తొలి యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం, విస్తరణలో భాగంగా ఏర్పాటు చేయనున్న రెండో యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రాజెక్ట్ ప్రాముఖ్యతపై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా గనుల్లో ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వాణిజ్య స్థాయిలో బంగారం ఉత్పత్తికి మార్గం సుగమమైంది.
రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశ
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ రాయలసీమ ఆర్థిక వ్యవస్థకు కీలక మలుపుగా మారే అవకాశముంది. పరిశ్రమలు, ఉపాధి, ప్రభుత్వ ఆదాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో ఈ ప్రాజెక్ట్ ప్రభావం చూపనుంది. ఒకప్పుడు కరవు ప్రాంతంగా పేరుగాంచిన రాయలసీమ, ఇప్పుడు బంగారం ఉత్పత్తి కేంద్రంగా దేశ దృష్టిని ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో జొన్నగిరి పేరు రాబోయే రోజుల్లో భారత గోల్డ్ మ్యాప్‌లో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.