ఇకపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేముందు జాగ్రత్త : గీత దాటితే దబిడి దిబిడే

First Published | Nov 8, 2024, 11:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా వేధింపులపై దృష్టి పెట్టింది. ఇకపై భావ ప్రకటన స్వేచ్చ పేరిట సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన రాతలు రాసినా, అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టినా ఊరుకోబోమని స్వయంగా సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 

Chandra Babu

సోషల్ మీడియా... యావత్ ప్రపంచాన్ని ఒక్కటి చేసే అద్భుతమైన మాధ్యమం. స్నేహాన్ని, ప్రేమను పంచడమే కాదు మన భావాలను వ్యక్తం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రపంచం మొత్తం ఈ సోషల్ మీడియాకు దాసోహం అయ్యింది. చేతిలో స్మార్ట్ ఫోన్... అందులో సోషల్ మీడియా అకౌంట్స్... ఇది కామన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువమంది స్నేహితులను కలిగివుండటం, ఎక్కువగా పోస్టులు పెట్టడం, ఎక్కువమంది ఫాలో కావడం చాలా గొప్పగా భావిస్తున్నారు. 

ఇలా ప్రజలు ప్రేమనురాగాలు పంచుకోడానికి ఉపయోగపడ్డ ఈ సోషల్ మీడియా రానురాను మారిపోయి విద్వేషపు పడగ విప్పింది. సరదాగా చిట్ చాట్ చేసుకునే స్థాయినుండి సీరియస్ గా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకునే స్థాయికి చేరింది. చివరకు పరిస్థితి ఎలా అయ్యిందంటే ఈ సోషల్ మీడియా రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీల నాయకులు ఈ సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి ఏర్పడింది. నాయకుల రాజకీయ వ్యవహారాలపైనే కాదు కుటుంబసభ్యులపైనా సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు వెలుస్తున్నారు. ఈ విష సంస్కృతి భవిష్యత్ లో మరింత ముదిరిపోకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్నం సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది.

ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత ఈ సోషల్ మీడియా అరాచకాలపై సీరియస్ అయ్యారు. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ పేరిట ఇతరులను కించపర్చేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని... ఇలాంటి సోషల్ మీడియా పోస్టులపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు. ఇలా ప్రభుత్వ పెద్దలు ఆదేశించారో లేదో అలా పోలీస్ యాక్షన్ షురూ అయ్యింది. సోషల్ మీడియా కేటుగాళ్లకు తగిన బుద్ది చెప్పేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమయ్యింది. 
 

Social Media Abuses

సోషల్ మీడియాపై యుద్దం :  

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా అరాచకాలపై యుద్దం ప్రకటించింది. విద్వేషాలను రెచ్చగొట్టేలా, ఇతరులను మరీముఖ్యంగా మహిళలను కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రాక్షసానందం పొందేవారికి ఇకపై చుక్కలు చూపించనున్నారు. సోషల్ మీడియా సైకోలను వదిలిపెట్టేదే లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. 

సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటుచేస్తున్నారు. అడ్డగోలు పోస్టులుపెడితే చూస్తూ ఊరుకోబోమని... అరెస్ట్ చేసి బొక్కలో తోస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఇతరులపై దాడిచేసే వారిపై చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలువురికి BNSS ( Bharatiya Nagarik Suraksha Sanhita) సెక్షన్ 179కింద నోటీసులు ఇచ్చామని తెలిపారు. 

సోషల్ మీడియా అరాచకాలు తవ్వుతున్న కొద్ది బయటపడుతున్నాయని పోలీసులు అంటున్నారు. కేవలం రాష్ట్రం నుండే కాదు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి కూడా విద్వేషాలను రెచ్చగొట్టేలా, మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. ఇలాంటి సుమారు 15 వేల మంది యాక్టివిస్ట్‌ల గుర్తించామన్నారు. మన దేశంలో వుండేవారినే కాదు విదేశాల్లోని వారిని కూడా లుక్‌ ఔట్‌ నోటీసులు జారీచేసి పట్టుకుంటామని ఏపీ హోంశాఖ హెచ్చరించింది.
 


Social Media Abuses

సోషల్ మీడియా అరాచకాలపై చంద్రబాబు సీరియస్ :  

సోషల్ మీడియా ద్వారా కేవలం సామాన్యులే కాదు చివరకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా వేధింపులకు గురయ్యారు. ఆయన కుటుంబసభ్యులు, ఇంట్లోని ఆడవాళ్లపైనా అసభ్యకర పోస్టులు వెలిసాయి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోమంత్రి అనిత బిడ్డలపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టారు. ఇలా కూటమి ప్రభుత్వం, పార్టీల్లోని నాయకులే టార్గెట్ గా వైసిపి సోషల్ మీడియా అసభ్యకర పోస్టులతో రెచ్చిపోతుండటంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. 

తాజాగా ఈ సోషల్ మీడియా అరాచకాలపై చంద్రబాబు స్పందించారు. ఆడబిడ్డలను కించపరిచేలా వ్యవహరిస్తే ఎవరినీ వదిలిపెట్టమని... ఇకపై సోషల్ మీడియాలో  ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించారు.  ఇందుకోసం అవసరమైన చట్టాలను తీసుకువస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. 

గతంలో వైసిపి అధికారంలో వుండగా ఇలాగే సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిందని... ఇప్పుడు అధికారాన్ని కోల్పోయాక వారి అరాచకాలు మరింత పెరిగాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్దికి ఆటంకం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అన్నారు. అంతేకాదు తమ ఇంట్లోని ఆడబిడ్డలను కించపర్చేలా పోస్టులు పెడుతున్నారు అన్నారు. పవన్ కల్యాణ్ కూతుర్లపైనా ఇలాంటి పోస్టులు పెట్టారు... అలాంటి వారిని వదిలిపెట్టాలా? అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొవ్వు ఎక్కువై ఇలాంటి పనులు చేస్తున్నారు... వారి కొవ్వును కరిగిస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. 

బాంబులకు కూడా భయపడని తాను నిండు అసెంబ్లీలో తన కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడితే తట్టుకోలేకపోయాను... కన్నీళ్లు పెట్టుకున్నానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అలాంటిది తమ గురించి అసభ్యకర, అశ్లీల పోస్టులు పెడితే ఆడబిడ్డలు ఎలా తట్టుకుంటారు... భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటే అమ్మాయిల వ్యక్తిత్వాన్ని కించపర్చడమా? అని ప్రశ్నించారు. కాబట్టం దేశంలోనే  కాదు ఇతర దేశాల్లోని చట్టాలను అధ్యయనం చేస్తాం... ఇలాంటి వారిని కఠినంగా శిక్షించే చట్టాన్ని తీసుకువస్తామని చంద్రబాబు తెలిపారు.
 

Pawan Kalyan

సోషల్ మీడియా అగ్గి రాజేసిన పవన్ కల్యాణ్ : 

''నేనే హోంమంత్రి అయితే పరిస్థితి వేరేలా వుంటుంది'' ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియా అరాచకాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యేలా చేసారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను పోలీసులు ఎందుకు ఆపలేకపోతున్నారు? వీటికి హోంమంత్రి అనిత బాధ్యత వహించాల్సి వుంటుందని పవన్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాను హోంశాఖ అడగలేక కాదు...తీసుకోలేక కాదు... తీసుకుంటే పరిస్థితులు వేరేలా వుంటాయని పవన్ పేర్కొన్నారు. 

ఇలా సొంత ప్రభుత్వంపై పవన్ ఇంతలా సీరియస్ కామెంట్స్ చేయడానికి  ఆయన కూతుళ్లపై సోషల్ మీడియా పోస్టులే కారణమట. తాజాగా హోమంత్రి అనితతో భేటీ సందర్భంగా తన కోపానికి కారణాన్ని పవన్ వివరించారు. తన కూతుళ్ల కన్నీరు చూసి తట్టుకోలేకే ఇలా సీరియస్ కావాల్సి వచ్చిందని పవన్ వెల్లడించారు. సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీల పోస్టులపై తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు మంత్రులు చర్చించారు. 
 

YS Sharmila

చివరకు వైఎస్ షర్మిల, విజయమ్మ కూడా సోషల్ మీడియా బాధితులే : 

కేవలం కూటమి ప్రభుత్వం, టిడిపి, జనసేన, బిజెపి నాయకులే కాదు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి, చెల్లి కూడా సోషల్ మీడియా బాధితులే. వీరిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మామూలుగా లేదు. చివరకు వీరి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా కూడా కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఇది వైఎస్ జగన్ పార్టీవారే చేస్తున్నారనే ఆరోపణలు వున్నాయి... షర్మిల కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసారు. 

సోషల్ మీడియా సైకోలు, సైకో పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టించారని షర్మిల మండిపడ్డారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలను మరిచి మృగాలుగా మారిపోతున్నారని అన్నారు. మహిళల గురించి పోస్టులు పెట్టేటపుడు తమ తల్లి, చెల్లి, అక్కా ఆడవారేనని మరిచిపోతున్నారని అన్నారు. ప్రశ్నించే మహిళలను అసభ్యకర పోస్టులు, వికృత చేష్టలతో వేదిస్తూ రాక్షసానందం పొందుతున్నారని... ఇలాంటి సోషల్ మీడియా సైకోల బాధితుల్లో తాను కూడా వున్నానని షర్మిల అన్నారు. 
 

Latest Videos

click me!