ఇల్లు లేనివారికి గుడ్‌న్యూస్‌.. పేదలకు 3 సెంట్ల స్థలాలు.. మీరు అర్హులేమో చెక్ చేసుకోండి

First Published | Jul 29, 2024, 10:42 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. 2029 నాటికి శాశ్వత గృహ వసతిని కల్పించే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారు. 

ఏపీలో 100 రోజుల లక్ష్యంతో ఇళ్ల నిర్మాణం

రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష జరిగిందని... ఈ సమీక్షలో రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఝంగా చర్చించినట్లు తెలిపారు. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు లక్ష్యాలను కూడా నిర్దేశించినట్లు వెల్లడించారు. రానున్న 100 రోజుల్లో లక్షాల 25వేల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. 

Latest Videos


గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు

‘‘హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో కేంద్ర పథకాల ఆసరాతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూ సేకరణ జరిపి.. లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదు. ఇటువంటి బాధిత లబ్దిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.’’ అని మంత్రి పార్థసారథి తెలిపారు.

ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం

అలాగే, ‘‘పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై  ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి, మౌలిక సదుపాయాలను కల్పించలేదు. అలాంటి లేవుట్లలో కూడా మౌళిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2014-19, 2019-24 మధ్య పోల్చితే గృహ నిర్మాణ పథకంలో గత ప్రభుత్వ హయాంలో 9 నుంచి 10 వేల కోట్ల రూపాయల వరకూ పేదలకు అన్యాయం జరిగింది. పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేదవారికి అందకుండా చేసింది. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పుకునే గత ముఖ్యమంత్రి జగన్.. వారికి కూడా ఎలాంటి అదనపు లబ్దిలేకుండా చేశారు. 2014-19 మధ్య కాలంలో యూనిట్ ఖరీదు రూ.2.5 లక్షలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.50 వేల నుంచి రూ.1 లక్షల వరకూ లబ్ధి చేకూర్చాం’ అని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు.

రూ.4 లక్షల యూనిట్ కాస్టుతో ఇళ్ల మంజూరు

‘‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూ.4 లక్షల యూనిట్ కాస్టుతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు త్వరలోనే సర్వే కూడా చేపట్టనున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఆసరాతో చేపట్టిన గృహాల్లో ఇంకా 8 లక్షల గృహాలు ప్రగతిలో ఉన్నాయి. వాటిని కూడా మా ప్రభుత్వం పూర్తిచేస్తుంది. పీఎంఏవై 2.0 ప్రకారం కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేస్తాం. కోర్టు కేసుల్లో ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట సంబందిత లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చే అవకాశం కొత్త పథకంలో ఇవ్వాలని నిర్ణయించాం’’ అని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

click me!