ఖేల్‌ ఖతం: వాలంటీర్ల రద్దుకు తీర్మానం

First Published | Jul 29, 2024, 9:33 PM IST

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం కీలక తీర్మానం చేసింది.

వైసీపీ సైన్యం.. అధికారం అపరిమితం!

గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ.. 2019లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకొచ్చిన వ్యవస్థ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు రూ.5వేలు నెలవారీ గౌరవ వేతనంతో వాలంటీర్లను నియమించారు. వీరికి అధికారికంగా అధికారాలు పరిమితమే అయినప్పటికీ.. చెలాయించిన అధికారం మాత్రం అపరిమితం. తమ సైన్యమని జగన్‌, వైసీపీ నేతలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదేపదే చెప్పారు.

సమాంతర వ్యవస్థ

అయితే, వైసీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో వాలంటీర్లు ఒకరు. పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సమాంతరంగా ఏర్పాటైన సచివాలయ వ్యవస్థలో సర్పంచులకు అధికారాలు లేకుండా పోయాయన్న విమర్శలు ఉన్నాయి. అలాగే, వాలంటీర్ల కారణంగా సర్పంచులకు గ్రామాల్లో విలువ లేకుండా పోయిందని.. సర్పంచులను మించి వాలంటీర్లు జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Latest Videos


కొనసాగిస్తారా.. లేదా..?

ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు, ఇతర కూటమి ముఖ్య నేతలు హామీ ఇచ్చారు. వైసీపీ రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తే తాము రూ.10 వేలు ఇస్తామన్నారు. ఎన్నికల్లో వైసీపీ అనుకూలంగా పనిచేయొద్దని కోరారు. అయితే, ఎన్నికల్లో చాలా మంది వైసీపీకి అనుకూలంగానే పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు తమ విధులకు రాజీనామా చేసి మరీ వైసీపీ కోసం ఎన్నికల్లో పనిచేశారు. వైసీపీ ఏజెంట్లుగానూ పోలింగ్‌ రోజు వ్యవహరించారు. 

గ్రామ, వార్డు వాలంటీర్లు

ఇక, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్‌ వ్యవస్థపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆ వ్యవస్థ ఉంటుందని గానీ, తొలగిస్తామని గానీ చెప్పలేదు. అయితే, గతంలో వైసీపీ వెంట నడిచిన వాలంటీర్లలో అనేక మంది తమను కొనసాగించాలని కూటమి ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు విన్నవిస్తున్నారు. 

సర్పంచుల కీలక తీర్మానం

అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం కీలక తీర్మానం చేసింది. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ తీర్మానించాయి. పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు మొదటి నుంచి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవస్థల కారణంగా ప్రజలు ఎన్నికున్న తాము ఉత్సవ విగ్రహాల్లా మారామని సర్పంచులు అనేక మార్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

సర్పంచులు చేసిన మరికొన్ని తీర్మానాలు

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్ల నెలవారీ గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. 
సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్ల గౌరవ వేతనం ప్రతినెలా వారి సొంత అకౌంట్లోకి వేయాలి. 
గతంలో మాదిరిగా గ్రామాల్లో పని చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు కేంద్ర ప్రభుత్వమే జీతాలు చెల్లించాలి.
గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి హామీ నిధులను 90%- 10% రేషియోతో అవకాశం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంవత్సరంలో ఒకరోజు తిరుమల దర్శనానికి అవకాశం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.

click me!