Andhra Pradesh DSC : ఇప్పటికే ఓ ఛాన్స్ మిస్సయ్యిందా… మెగా డిఎస్సిలో జాబ్ సాధించలేకపోయామని బాధపడుతున్నారా…అయితే మీకు మరో ఛాన్స్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఈసారి అస్సలు మిస్సవ్వొద్దు.
Andhra Pradesh DSC : నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా వేలాది ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు APPSC, APPRB ద్వారా వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్. ఇకపై కూడా ఇలాగే వరుసగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు వెలువడతాయని... నిరుద్యోగ యువత రెడీగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఇలా ఇచ్చిన హామీ మేరకు మరోసారి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది కూటమి ప్రభుత్వం.
26
నారా లోకేష్ కీలక ప్రకటన
మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశమై కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామన్న హామీ మేరకు వచ్చేఏడాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మెగా డిఎస్సిలో ఉద్యోగాలను పొందినవారికి పోస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే మరో డిఎస్సికి మంత్రి ఆదేశాలివ్వడం ఆసక్తికరంగా మారింది. మెగా డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధించలేకపోయినవారు మరో రెండుమూడు నెలలు కష్టపడితేచాలు... ఈసారి కలల ఉద్యోగాన్ని సాధించవచ్చు.
36
నిరుద్యోగ యువతకు మరో అవకాశం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేయాలని కలగనే రాష్ట్ర యువతీయువకులకు కూటమి సర్కార్ మరో అవకాశం కల్పిస్తోంది. వచ్చేనెల నవంబర్ చివరివారంలో టీచర్ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇక 2026 జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ వేసి తొందరగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. మార్చి 2026 లో డిఎస్సి పరీక్ష నిర్వహించాలని... వేసవి సెలవులు ముగిసి నూతన విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికి టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని నారా లోకేష్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు తగిన ప్రణాళిక సిద్దంచేసి వెంటనే మరో నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.
మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించనలేని అభ్యర్ధులంతా ఏమాత్రం నిరాశ చెందరాదని... మరోసారి డిఎస్సీ రాసేందుకు సన్నద్ధం కావాలని లోకేష్ సూచించారు. ఇకపై ప్రతిఏటా డిఎస్సి ఉంటుందని మరోసారి హామీ ఇచ్చారు. ఇకపై ఉద్యోగ నియామకాలన్ని షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని... నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు ఉండవన్నారు. పట్టుదలతో కష్టపడి చదివే ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని... కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలబడుతుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
56
ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు
ఇదిలావుంటే కేవలం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడమే కాదు విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా వారిని తీర్చిదిద్దుతామని నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ విద్యాసంస్థల స్థాయిలో విద్యాబోధన అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ప్రభుత్వ కార్యక్రమాలకు తగిన సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
66
ఉపాధ్యాయులకు ఫారెన్ ట్రిప్
రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఇలా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలను పరిశీలించి వాటిని రాష్ట్రంలో అమలుచేయడం ద్వారా మన విద్యావ్యవస్థ మెరుగుపడుతుంది... తద్వారా ఇక్కడ చదివే విద్యార్థులు ప్రపంచస్థాయిలో మెరుగ్గా రాణిస్తారని నారా లోకేష్ అన్నారు.