
Andhra Pradesh Politics : ఆంధ్ర ప్రదేశ్ లో అసలు ఏం జరుగుతోంది...? మాజీ మంత్రులు అంబటి రాంబాబు అరెస్ట్, ఆయన ఇంటిపై దాడి.. తర్వాత మాజీ జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలు వెంటవెంటనే జరిగాయి. ఈ రెండు ఘటనలు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. వైసిపి, టిడిపి నాయకుల మధ్య మాటలయుద్దం కాస్త ఇప్పుడు పరస్పర దాడులకు దారితీసింది. అయితే ఈ ఘటనలతో సామాన్య ప్రజలకు ఒక్కటిమాత్రం అర్థం అవుతోంది... సీఎంగా చంద్రబాబు ఉన్నా, వైఎస్ జగన్ ఉన్నా... అధికారంలో టిడిపి ఉన్నా, వైసిపి ఉన్నా కక్షసాధింపు రాజకీయాలు కామన్ అని. ప్రస్తుతం ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం.
తిరుమల లడ్డూ వ్యవహారంలో చాలాకాలంగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి వైసిపిపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసిపి హయాంలో తిరుమల లడ్డూలో స్వచ్చమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారుచేసింది కలిపారని టిడిపి.. లేదు లేదని వైసిపి అంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై పెనుదుమారం రేగింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుచేశారు.
ఇటీవల లడ్డూ వివాదం సద్దుమణుగుతున్న వేళ సిట్ ప్రభుత్వానికి రాసిన లేఖ మళ్లీ ఉద్రిక్తతలు పెంచింది. ఇందులో తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ పేర్కొన్నట్లు వైసిపి చెబుతోంది. కల్తీ నెయ్యి వాడారనే సిట్ చెబుతోందని టిడిపి అంటోంది. ఇలా మరోసారి తిరుమల లడ్డూ అంశంపై రాజకీయ దుమారం రేగింది. ఇదే అంశం మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు కారణమయ్యింది... తర్వాత జరుగుతున్న ఘటనలకు ఆజ్యం పోసింది.
తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదని సిట్ విచారణలో తేలినట్లు వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. దీన్ని తిప్పికొడుతూ టిడిపి ఏకంగా ప్లెక్సీలు ఏర్పాటుచేసింది. ఇలా గుంటూరులో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు దారితీశాయి.
కూటమి ప్రభుత్వం కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకుంటోందంటూ అంబటి రాంబాబు పాప ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళుతుండగా ఆయనను టిటిడి శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి ప్లెక్సీలు చించడానికే ఆయన వచ్చాడని... అందుకే అడ్డుకున్నామని టిడిపి నాయకులు అంటున్నారు.
ఇలా తన కారును టిడిపి అడ్డుతగలడంతో అంబటి రాంబాబు ఆవేశంతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు... దీంతో టిడిపి కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఆయన ఇంటిపై దాడి చేశారు... అలాగే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలా అందిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదుచేసి శనివారం రాత్రి అంబటిని అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే మాటలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ అరెస్ట్‌ను వైసీపీ రాజకీయ ప్రతీకార చర్యగా ఆరోపిస్తోంది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నమే ఇది.. అక్రమ కేసులతో కక్ష సాధింపు సరికాదని అంటున్నారు. అంబటి రాంబాబు అరెస్ట్ విషయం బయటకు రాగానే వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. పలు చోట్ల నిరసనలు కూడా చేపట్టారు.
ఇదే సమయంలో వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి మరో సంచలనంగా మారింది. రాత్రి సమయంలో టిడిపి శ్రేణులు ఇంటిపై దాడి చేసినట్లు జోగి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు హాని తలపెట్టాలనే ఈ దాడికి పాల్పడ్డారని... ఇంటికి నిప్పు పెట్టారని మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి జరిగిందని... ఎంపీ కేశినేని చిన్నికి చెందిన గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఇందులో పాల్గొన్నారని జోగి రమేష్ ఆరోపించారు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు కావాలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతీయడానికి రెచ్చగొడుతున్నారు.. కాబట్టి టిడిపి శ్రేణులు సంయమనం పాటించాలని సూచించారు. వారిలాగే దాడులకు దిగితే సహించబోనని... చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు టిడిపి శ్రేణులను సముదాయించాలని... చట్టవ్యతిరేకంగా దాడులకు ప్రోత్సహించరాదని సూచించారు.
హింసాత్మక ఘటనలకు పాల్పడేవారికి అస్సలు వదిలిపెట్టకూడదని పోలీసులకు సూచించారు చంద్రబాబు నాయుడు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడి ఘటనలో విచారణ జరుగుతోందని, రాజకీయ కోణంతో పాటు ఇతర అంశాలను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ పరిణామాలపై టీడీపీ నేతలు గట్టిగానే స్పందిస్తున్నారు. ఇది కక్ష సాధింపు కాదు.. చట్టపరమైన చర్యలు మాత్రమేనని అంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేస్తే వారిపై చట్టం ప్రకారమే చర్యలుంటాయని అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన అక్రమాలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటనలతో ఏపీలో రివర్స్ పాలిటిక్స్ మొదలైందా అనే చర్చ మొదలైంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి... ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ కేసులు ఒక్కొక్కటిగా ముందుకు రావడం రాజకీయ వేడి పెంచుతోంది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం గతంలో వైసిపి వ్యవహరించిట్లే టిడిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని... ఉద్రిక్తతలు, దాడులకే ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు, విచారణలు ఉంటాయని అంటున్నారు. రాజకీయ కక్షలకంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలంటున్నారు.
అంబటి రాంబాబు అరెస్ట్, జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార టీడీపీ చట్టపరమైన చర్యలంటూ ముందుకెళ్తుంటే.. ప్రతిపక్ష వైసీపీ రాజకీయ ప్రతీకారమంటూ పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ రాజకీయ సమరం రాబోయే రోజుల్లో ఏ దిశగా వెళ్తుందో చూడాలి.