Altered oil: మీరు వాడుతోన్న నూనె పశువుల కొవ్వుతో చేసిందా.? ఎలా తెలుసుకోవాలంటే..

Published : Feb 04, 2026, 07:07 AM IST

Altered oil: కాసుల క‌క్కుర్తీ కోసం కొంద‌రు క‌ల్తీ గాళ్లు ప్ర‌తీ వ‌స్తువును న‌కిలీ చేస్తున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలు పోయినా స‌రే త‌మ జేబులు నిండాల‌ని చూస్తున్నారు. తాజాగా వెలుగులోకి వ‌చ్చిన క‌ల్తీ నూనె వ్య‌వ‌హారం అంద‌రినీ ఉలిక్కిప‌డేలా చేసింది.

PREV
15
ఏలూరు పరిసరాల్లో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏలూరు నగరానికి సమీప ప్రాంతాల్లో పశువుల కొవ్వుతో నూనె తయారీ జరుగుతోందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు అల‌ర్ట్ అయ్యారు. ఈ సమాచారం ఆధారంగా జిల్లా ఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం సీఐలు గంగాభవాని, ప్రసాద్‌కుమార్ సిబ్బందితో కలిసి తంగెళ్లమూడి ప్రాంతంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద కార్యకలాపాలు బయటపడ్డాయి.

25
మూడు ప్రాంతాల్లో అక్రమ నూనె తయారీ కేంద్రాలు

తంగెళ్లమూడి, ఆదివారపుపేట, లంకపేట ప్రాంతాల్లో గేదెలు, ఆవులు, ఇతర జంతువుల కొవ్వును కరిగించి నూనెగా మార్చుతున్నట్లు అధికారులు గుర్తించారు. రెండు ఇళ్లలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన నూనె బయటపడింది. విక్రయానికి సిద్ధంగా ఉంచిన సుమారు 390 లీటర్ల నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో బయ్యారపు జయన్న, షేక్ షౌకత్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

35
ఇతర జిల్లాలకు సరఫరా

విచారణ సమయంలో షేక్ షౌకత్ కీలక విషయాలు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. పశువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను కాకినాడ జిల్లా సామర్లకోట ప్రాంతానికి చెందిన నజరత్ అనే వ్యక్తికి విక్రయిస్తున్నామని చెప్పినట్లు సమాచారం. ఈ నూనె ఎలాంటి ఆహార తయారీకి ఉపయోగిస్తున్నారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న నూనె నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. సాధార‌ణంగా ఇలాంటి నూనెలు హోట‌ల్స్‌, ఫాస్ట్‌ఫుడ్ వంటి వాటిలో ఉప‌యోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

45
పశువుల కొవ్వుతో చేసిన నూనెను ఎలా గుర్తించాలి

ఇటీవలి కాలంలో ఇలాంటి నూనె తయారీ ఘటనలు పెరుగుతున్నాయి. సాధారణ నూనెలతో పోలిస్తే పశువుల కొవ్వుతో చేసిన నూనెలో కొన్ని ప్ర‌త్యేక‌ లక్షణాలు కనిపిస్తాయి. నూనె చల్లబడినప్పుడు గడ్డకట్టడం, తెల్లటి పొర ఏర్పడడం, వేడి చేసినప్పుడు తీవ్రమైన దుర్వాసన రావడం వంటి లక్షణాలు ఉంటాయి. చేతికి రాసినప్పుడు అతుక్కుపోయిన భావన ఎక్కువగా ఉంటుంది. ధర చాలా తక్కువగా ఉంటే కూడా అనుమానించాలి.

55
ఆరోగ్యంపై తీవ్రమైన ప్రమాదం

పశువుల కొవ్వుతో తయారైన నూనెను ఆహారంలో ఉపయోగిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాలేయం దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంగా వినియోగిస్తే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన పరిశుభ్రత లేకుండా తయారయ్యే ఈ నూనెలో హానికర బ్యాక్టీరియా ఉండే అవకాశమూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి, అనుమానాస్పద నూనెను వాడకూడదు. అలాగే బ‌య‌ట ఫుడ్ తినే స‌మ‌యంలో కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories