
అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్న నార్వే జట్టుకు విమానాశ్రయంలో సాంప్రదాయ వాటర్ కానన్ సెల్యూట్ ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆటగాళ్లు ఓపెన్‌టాప్ బస్సులో ఒస్లో నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ముందుగా నార్వే రాజు హరాల్డ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జట్టు సభ్యులు, తర్వాత రాయల్ ప్యాలెస్ మెట్లపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. నగరంలోని ప్రధాన రహదారి కార్ల్ జోహాన్స్ గేట్‌తో పాటు రాయల్ ప్యాలెస్ పరిసర ప్రాంతాలు అభిమానులతో కిక్కిరిశాయి.
ఈ వేడుకలో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ కనిపించలేదు. అలాగే మిడ్‌ఫీల్డర్ సాండర్ బెర్గే కూడా హాజరుకాలేదు. దీనిపై స్పందించిన ప్రధాన కోచ్ స్టాలే సోల్‌బక్కెన్ మాట్లాడుతూ, అమెరికా నుంచి బయలుదేరిన విమానం నాలుగు గంటలు ఆలస్యమవడంతో ఇద్దరూ ముందుగానే తమ తదుపరి విమానాలను అందుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే హాలాండ్ లేకపోయినా అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.
జట్టు కెప్టెన్ మార్టిన్ ఒడెగార్డ్ అభిమానుల ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. "ఇలాంటి స్పందన వస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు. అమెరికాలోనూ, స్వదేశంలోనూ అభిమానులు మాకు చూపిన ప్రేమ అద్భుతం. ఈ సపోర్టును జీవితాంతం గుర్తుంచుకుంటాం" అని ఆయన చెప్పారు.
నార్వే ఫుట్‌బాల్ జట్టు కూడా తమ అధికారిక ఎక్స్ ఖాతాలో స్వాగత వేడుకల వీడియోను పంచుకుంటూ, "బయట ఎంత బాగున్నా... సొంత ఇల్లు అంతకంటే గొప్పది" అనే నార్వే సామెతను జోడించింది.
The national team is parading through Oslo in an open-top bus from the Royal Palace to City Hall, as people line the streets to celebrate Norway’s historic World Cup achievement. pic.twitter.com/aAXJn7Z6vk
— Joakim 🌹🇳🇴🇪🇺 (@joakial_) July 13, 2026
ఓపెన్‌టాప్ బస్సులో నిర్వహించిన ర్యాలీకి భారీగా అభిమానులు రావడంతో కొంతసేపు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ఒక దశలో పోలీసులు దారి ఖాళీ చేసే వరకు బస్సును వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. మరో సందర్భంలో రోడ్డుపై ఉన్న విద్యుత్, కమ్యూనికేషన్ కేబుళ్లు తక్కువ ఎత్తులో ఉండటంతో బస్సు పైభాగంలో నిలబడ్డ ఆటగాళ్లు కూర్చోవాల్సి వచ్చింది. అనంతరం ర్యాలీ తిరిగి కొనసాగింది.
ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నార్వే ఓడిపోయినా, ఈ ప్రపంచకప్‌లో ఆ జట్టు కనబర్చిన ఆటతీరు దేశ ప్రజల మనసులు గెలుచుకుంది. చివరకు ఒస్లో సిటీ హాల్ స్క్వేర్‌కు చేరుకున్న జట్టుకు వేలాది మంది అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతూ సంబరాలు జరుపుకున్నారు. టోర్నీ ట్రోఫీని గెలవలేకపోయినా, అభిమానుల గుండెల్లో మాత్రం నార్వే జట్టు నిజమైన విజేతగా నిలిచిందని ఆ దేశ ప్రజలు మరోసారి నిరూపించారు.