జంక్ ఫుడ్ వద్దు.. పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే...

By telugu news team  |  First Published Apr 13, 2021, 2:42 PM IST

చిన్నతనం నుండి అధిక కెలోరీలు ఉన్న ఆహారం, నూనె పదార్థాలు, స్వీట్స్‌, జంక్‌ ఫుడ్స్‌ తినడం వల్ల పదిహేనేళ్లలోపు పిల్లలలో అధిక బరువు సమస్య ఏర్పడవచ్చు.


ప్రస్తుత కాలం పిల్లలు ఇట్టే జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. బయటకు వెళితే  చాలు బర్గర్, పిజ్జా అంటూ వాటివైపే పరిగెడుతున్నాయి. అయితే.. అలాంటి ఫుడ్స్ తినడం వల్ల తెలీకుండానే పిల్లలు బరువు పెరిగిపోతారని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లలకు చిన్నప్పుడు తినిపించే పదార్థాల వల్లే పెద్దయిన తరువాత వారి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.  చిన్నతనం నుండి అధిక కెలోరీలు ఉన్న ఆహారం, నూనె పదార్థాలు, స్వీట్స్‌, జంక్‌ ఫుడ్స్‌ తినడం వల్ల పదిహేనేళ్లలోపు పిల్లలలో అధిక బరువు సమస్య ఏర్పడవచ్చు. అది అలాగే కొనసాగితే యుక్త వయసులో కూడా అధిక బరువు, ఊబకాయం సమస్యలు ఎదురవుతాయి. 

Latest Videos

జంక్‌ ఫుడ్స్‌కి బదులుగా పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, బాదం, ఆక్రోట్‌, వేరుశెనగ, వేయించిన శనగలు, బఠాణి లాంటి గింజలు; మొలకలు, ఉడికించిన గింజలు, మొక్కజొన్నలు మొదలైనవి స్నాక్స్‌గా అలవాటు చేయాలి.  వీటితో వివిధ రకాల చాట్స్‌, సలాడ్లు, టిక్కీలు, కట్లెట్స్‌ చేయవచ్చు. చపాతీలో గుడ్డు, పనీర్‌, చికెన్‌ లాంటివి చేర్చి రోల్స్‌ చేయొచ్చు. ఇలా  పిల్లలు ఇష్టపడేలా తయారుచేయాలి. 

వీటివల్ల ఆకలి తీరడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు అందుతాయి. ఇళ్లలో చేసినవైనా, బయటి నుండి తెచ్చినవైనా స్వీట్లు, నూనెలో వేయించిన పిండివంటలు, బిస్కెట్లు, చాక్‌లెట్లు, బేకరీ ఫుడ్స్‌ వీలైనంత తక్కువగా పిల్లలకు ఇవ్వాలి. ఈ చిరుతిళ్ళ వల్ల ఆరోగ్యానికి హానిచేసే సాచురేటెడ్‌ కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాట్స్‌, అధిక కెలోరీలు శరీరంలో చేరతాయి. దీంతో చిన్నతనంలోనే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది.  

click me!