
ఎండాకాలం మొదలైంది. ఈ సీజన్ లో తాటిముంజలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరం వేడిని తగ్గించి చల్లగా ఉంచే ఆహారాల్లో తాటిముంజలకు సాటి లేదు. ఇది కేవలం ఒంట్లో వేడిని మాత్రమే తగ్గిస్తుందని అనుకుంటే పొరపాటే. ఇందులో ఉండే పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ముంజల్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ బి లాంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇది ఎండాకాలంలో వరం లాంటిది. ముంజలను కొబ్బరి నీళ్లలో నానబెట్టి తింటే పోషకాలు ఎక్కువగా అందుతాయి. అలాగే తాటి నీళ్లలో వేసుకొని తిన్నా రుచిగా ఉంటుంది.
- ఎండాకాలంలో వచ్చే చర్మ వ్యాధులను నివారించడానికి తాటిముంజలు చాలా ఉపయోగపడతాయి. వీటిని తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువు తగ్గించే శక్తి తాటిముంజలకు ఉంటుంది.
- ముంజలు కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తాయి. మలబద్ధకం, విరేచనాల సమస్యలు ఉన్నవాళ్లకు ఇవి చాలా మంచిది. అంతేకాకుండా ముంజలు పేగుల్లోని పుండ్లను కూడా నయం చేస్తాయి.
- హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవాళ్లు ముంజలు తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది.
- నాలుకపై తరచుగా పుండ్లు వస్తుంటే, రెండు ముంజలను గుజ్జు తీసి మిక్సీలో వేసి రుబ్బుకుని, అందులో కొబ్బరి పాలు కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే అల్సర్ సమస్య తగ్గుతుంది.
- ఎండాకాలంలో జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొటిమలు రాకుండా ఉండటానికి తాటిముంజలు తినవచ్చు.
- మండే ఎండల వల్ల వచ్చే చెమటకాయలు, బొబ్బలు, ఇతర చర్మ సమస్యల నుంచి బయటపడటానికి ముంజలు సహాయపడుతాయి.
- చెమటకాయలపై తాటిముంజల నీటిని రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి.
- షుగర్ పేషెంట్లు ముంజలు తింటే రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుందని చెబుతారు.
- అజీర్తి సమస్య, కాలేయ సమస్య ఉన్నవాళ్లకు ముంజలు తినడం చాలా మంచిది.
- శరీర వేడితో బాధపడేవాళ్లకు ముంజలు దివ్య ఔషధం. దీన్ని తింటూ ఉంటే శరీరంలో నీటి కొరత ఉండదు.
1. గర్భిణీలు ముంజలు తింటే త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే తరచుగా ఎసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి ముంజలు సహాయపడతాయి. ఎండ వల్ల వచ్చే ఒంటి అలసటను పోగొట్టడానికి ఇది బాగా పని చేస్తుంది.
2. కొత్తగా బిడ్డను కన్న స్త్రీలు తాటిముంజలు తింటే తల్లిపాలు బాగా వస్తాయని చెబుతారు. అంతేకాకుండా బిడ్డకు పోషకాలు బాగా అందుతాయి.
3. తాటిముంజలు తినడం ద్వారా ఆడవారిలో వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది.
4. ముంజలో ఆంథోసైనిన్ అనే రసాయనం ఉండటం వల్ల ఇది ఆడవాళ్లకు వచ్చే రొమ్ము క్యాన్సర్ గడ్డలు రాకుండా అడ్డుకుంటుంది. ఆడవాళ్లు తాటిముంజలు తినడం చాలా మంచిది.
5. గర్భిణీలకు తాటిముంజలు మంచిదే అయినప్పటికీ వాళ్లు ఉదయం టిఫిన్ చేసిన తర్వాతే వాటిని తినాలి. అలాగే మధ్యాహ్నం ముంజలు తినడం మానుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. సంబంధిత డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత తినడం మంచిదంటున్నారు.