Rakhi Festival 2025: రాఖీ పండుగ రోజు సోదరుడు తన అక్కాచెల్లెళ్ల ఇంటికి వెళ్లకూడదు.. ఎందుకో తెలుసా?

Published : Aug 06, 2025, 12:49 PM IST
rakhi festival 2025

సారాంశం

రాఖీ పండుగ ఆగస్టు 9న నిర్వహించబోతున్నాం. అయితే ఆ రోజున అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల ఇంటికి వెళతారు. నిజానికి అలా వెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి. 

హిందూమతంలోని ప్రముఖ పండుగలో రాఖీ పండుగ ఒకటి. దీన్నే చాలా చోట్ల రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఈ రక్షాబంధన్ ఎన్నో నమ్మకాలు, నియమాలతో సాగుతుంది. సోదరి సోదరుల మధ్య విడదీయరాని ప్రేమకు ప్రత్యేకంగా ఈ పండుగను నిర్వహించుకుంటాం. రక్షాబంధన్ పండుగ నాడు కొంతమంది అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల ఇంటికి వెళ్లి మరి రాఖీ కట్టించుకుని వస్తారు. నిజానికి అలా చేయడం పద్ధతి కాదు. రాఖీ పండుగ రోజు సోదరుడికి రాఖీ కట్టేందుకు కచ్చితంగా అక్కా చెల్లెలు సోదరుడు ఇంటికి రావాలి. సోదరుడే అక్కాచెల్లెళ్ల ఇంటికి వెళ్లి రాఖీని కట్టించుకోకూడదు. ఎందుకో కూడా తెలుసుకోండి.

రాఖీ కట్టి భర్తను తెచ్చుకున్న లక్ష్మీదేవి

రాఖీ పండుగ వెనక ఎన్నో పౌరాణిక కథలు ఉన్నాయి. అందులో ఒకటి రాక్షస రాజు బలి కథ. ఒకప్పుడు రాక్షస రాజు అయిన బలి... విష్ణువును సంతోష పెట్టి అతని నుండి అమరత్వాన్ని పొందాడు. అయితే బలిరాజు అందుకున్న వరం వల్ల దానిని ఎప్పుడైనా దుర్వినియోగం చేస్తాడని దేవతలందరూ భావించారు. అదే విషయాన్ని విష్ణువుకు చెప్పారు. విష్ణువు వామనుని అవతారంలో బలి రాజు దగ్గరకు వచ్చి మూడు అడుగుల భూమిని భిక్షగా కోరాడు. బలి చక్రవర్తి వామనుని కోరికతో ఆ భూమిని ఇచ్చేందుకు అంగీకరించాడు. అతడు మొదటి అడుగును ఆకాశమంతా వేశాడు. ఇక రెండవ అడుగుతో భూమిని మొత్తం ఆక్రమించాడు. మూడోవాడు ఎక్కడ వేయాలని బలి చక్రవర్తిని అడిగాడు. అప్పుడు బలిరాజు తన తల పైన వేయమని తనను తానే వామనుడికి అర్పించాడు.

విష్ణువే స్వయంగా వామనుడి రూపంలో వచ్చాడని బలికి అప్పటికే అర్థమయిపోయింది. అందుకే మూడో అడుగును తనపై వేసేందుకు తన శరీరాన్ని ఇచ్చాడు. విష్ణువు అతడు చెప్పినట్టే అతడి తలపై కాలువేసి బలిని పాతాళలోకానికి పంపించాడు. పాతాళ లోకానికి బలి చక్రవర్తే రాజుగా మారాడు.

బలి పాతాళ లోకానికి రాజు అయిన తర్వాత విష్ణువును కూడా పాతాళ లోకంలోనే నివసించమని కోరాడు. దీంతో విష్ణువు బలి కోరిక మేరకు పాతాళంలోనే ఎన్నో ఏళ్లపాటు జీవించాడు. దీంతో లక్ష్మీదేవి ఒంటరిగా మారి ఎంతో ఆందోళన చెందింది.

పాతాళలోకంలోనే విష్ణువు

తన భర్తని తిరిగి వైకుంఠానికి తీసుకొచ్చేందుకు ఆమె తెలివిగా ఆలోచించింది. బ్రాహ్మణ స్త్రీ రూపాన్ని ధరించింది. పాతాళ లోకానికి వెళ్లి బలి చక్రవర్తిని తన సోదరుడిగా మారమని కోరింది. బలి చక్రవర్తి ఆమె కోరికను అంగీకరించాడు. అప్పుడు లక్ష్మీదేవి బలి చక్రవర్తి చేతికి రాఖీని కట్టింది. అలా కట్టిన తర్వాత బలి ఆమెను ఏదైనా కోరిక కోరుకోమని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి తన భర్త విష్ణువును తిరిగి తనకు ఇవ్వమని కోరింది. తన నిజరూపాన్ని ధరించి బలి చక్రవర్తికి కనిపించింది. చెల్లెలికిచ్చిన మాట కోసం బలి చక్రవర్తి విష్ణువును తిరిగి వైకుంఠనికే పంపించాడు. అప్పటినుండి రాఖీ పండుగ రోజు అక్కాచెల్లెళ్లు ఎవరైనా తన సోదరుడు ఇంటికే వెళ్లి రాఖీ కట్టాలని నమ్ముతారు. సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకోకూడదని చెబుతారు. కాబట్టి అక్కాచెల్లెళ్లు ఎవరైనా కూడా రాఖీ పండుగ రోజు మీ అన్నదమ్ముల క్షేమాన్ని కోరితే మీరే వారి ఇంటికి వెళ్లి నుదుటిన బొట్టు, పెట్టి రాఖీ కట్టి ఆరోజు ఆ ఇంట్లోనే భోజనం చేసి తిరిగి ఇంటికి రండి. ఇది మీకే కాదు మీ సోదరుడికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

రాఖీ పండుగ అనేది అన్నదమ్ములు, అక్కా చెల్లెల మధ్య ప్రేమ, అనురాగానికి ప్రతీకగా నిర్వహించే పండుగ. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దీనిని నిర్వహించుకుంటాము. సోదరి తన అన్నా తమ్ముళ్లకు రాఖీని కట్టి వారి సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తుంది. ఇక సోదరుడు తన అక్కాచెల్లెళ్లకు జీవితాంతం రక్షణగా ఉంటానని వాగ్దానం చేస్తాడు.

ఇక్కడ చెప్పిన బలి చక్రవర్తి లక్ష్మీదేవి కథ మాత్రమే కాదు. పౌరాణికంగా శ్రీకృష్ణుడు, ద్రౌపదీ కథ... రాణి కర్ణావతి హోమయూన్ కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ పండుగకు ధనిక, పేద అనే తారతమ్యం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు అందరూ కూడా తమ స్థాయిలో సోదరుడికి రాఖీని కట్టి తగిన బహుమతులను ఇస్తారు. అలాగే సోదరుడు కూడా తనకు తన స్థాయిలో సోదరికి బహుమతులు కొనిస్తాడు. ఆరోజు ఇద్దరూ ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?