
ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ శేఖర్ కపూర్ తాజాగా ట్విట్టర్ లో హిందీ డైరక్టర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరసపెట్టి బాహుబలి, 2.0 సూపర్ హిట్స్ సౌత్ నుంచి రావటంతో ఆయన హిందీ డైరక్టర్స్ ని సూటిగా ఓ ప్రశ్న అడిగారు. భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించడంలో దక్షిణాది దర్శకులు విజయవంతం అవుతున్నారు.
మరి ఎక్కడ ముంబై దర్శకులు విఫలమవుతున్నారు. దక్షిణాది దర్శకులకి సినిమాలు చేయడమంటే చాలా పాషన్. అందుకే వారు బాహుబలి, బాహుబలి 2, 2.0 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించి విజయం సాధించారు అన్నారు శేఖర్ కపూర్.
సౌత్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2, 2.0 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించి బాలీవుడ్ లో ప్రకంపనాలు పుట్టిస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ హిందీలోనూ క్రియేట్ చేసిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రీసెంట్‌గా విడుదలైన 2.0 చిత్రం రెండు వారాల్లో 700 కోట్లు వసూలు చేసింది. జపాన్‌లో ఈ చిత్రం భారీ స్క్రీన్స్‌లో విడుదల కానుండగా, అక్కడ కూడా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించనుందని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో హిందీలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో శేఖర్ కపూర్ ఈ కామెంట్స్ చేసి ఉంటాడని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.