
"ఉప్పెన" సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన బుచ్చిబాబు సనా మంచి విషయం ఉన్నవాడు అని మొదటి సినిమాతోనే ప్రూవ్ అయ్యింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకోవటంతో అందరి దృష్టీ ఈ దర్శకుడు మీదే ఉంది. నెక్ట్స్ ఏ హీరోతో బుచ్చిబాబు చెయ్యబోతున్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే రెండవ సినిమాకు ఎన్టీఆర్తో సినిమా చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవటం తో మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని అందరికీ అర్దమైంది. అయితే అక్కడే వచ్చింది చిక్కు.
అప్పట్లో .. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సినిమాలు చేయాల్సిన దర్శకులంతా తమ ప్రాజెక్ట్ విశేషాలను సోషల్ మీడియాలో చెప్పుకుంటూ విషెస్ తెలిపారు. అందులో భాగంగా ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన కూడ విషెస్ తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి కూడా ప్రస్తావించారు. బుచ్చిబాబు తన ట్వీట్‌లో ‘లోకల్ కథను ప్రపంచస్థాయిలో చెప్పి ట్రెండ్ సృష్టిద్దాం. అందుకోసం ఎదురుచూస్తున్నాను సర్’ అంటు రాసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఖుషీ అయ్యిపోయింది.
అయితే మరోవైపు ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా లేటు అవుతూ వస్తోంది. ఆచార్య డిజాస్టర్ తో స్క్రిప్టుపై చాలా కాలం పాటు కసరత్తు చేస్తూండటంతో ఆ ప్రాజెక్టు లేటు అవుతోంది. దాంతో బుచ్చిబాబుతో చేసే సినిమా మరింత వెనక్కి వెళ్తోంది. ఈ క్రమంలో ఆ సినిమా పూర్తి అయ్యేదాకా వెయిట్ చేసి, బుచ్చి బాబు సినిమా మొదలెట్టాలంటే కాస్త పెద్ద ప్రాసెసే. అయితే ఈ మధ్యలో ఓ పేరున్న హీరోతో సినిమా చేద్దామని మైత్రీ మూవీస్ వారు ప్రపోజల్ పెట్టారట. ఉప్పెన ప్రొడ్యూసర్స్ కే రెండో సినిమా చేయాల్సి ఉంది. దాంతో వేరే హీరోకు కథ రెడీ చేస్తున్నారట.
అయితే ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే ఏ సమస్యా రాదు. అలా కాకుండా సినిమా తేడా కొడితే ఎన్టీఆర్ తో సినిమా అనేది ఇబ్బందికర వ్యవహారం. కాబట్టి ఉప్పెన డైరక్టర్ తోనే ఎన్టీఆర్ సినిమా చెయ్యాలనుకుంటారు తప్పించి , మధ్యలో వేరే సినిమా చేసి వచ్చిన డైరక్టర్ తో అంటే కాస్త రిస్కే అంటోంది సినీ ప్రపంచం. ఇవన్నీ ఆలోచిస్తున్న బుచ్చిబాబు ఏమీ నిర్ణయం తీసుకోలేక పోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఒక స్పోర్ట్స్ సినిమాని ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియన్ రేంజిలో ఉండబోతోందని సమాచారం.