
టాలీవుడ్ నటి సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఫిబ్రవరి 26తో 7 సంవత్సరాలు పూర్తయింది. సమంత తొలిసారిగా వెండితెరపై రొమాన్స్ చేసింది నాగ చైతన్యతో. ఏం మాయ చేశావే చిత్రంతో వెండితెరకు పరిచయమైన సమంత ఇప్పుడు ఆ చిత్ర హీరో నాగచైతన్యతోనే ఏడడుగులు వేయబోతోంది.
అయితే... ఈ ఏడేళ్ల తన సినీ జివితం ద్వారా తన లైఫ్ లో ఎదురైన అనుభవాలు, మంచి చెడు, సంతోషం దుఃఖం అన్నీ ఇలా ఎన్నో తెలుసుకున్నానంటోంది. సమంత ఎమోషనల్ గా స్పందించింది. తన మనసులోని భావాలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
తాను కూడా అందరిలాగే అనేక కష్టాలు,నష్టాలు, అభద్రత, వైఫల్యాలు, తిరస్కారాలు, బాధ, ఆవేదన, విజయం, పేరు, డబ్బు ఇలా అన్నీ చూసానని అంటోంది. విజయాలు సాధించినంత మాత్రాన సంతోషంగా ఉన్నానని కాదని, సాధారణంగా ఉండటం ఎలాగో తెలుసుకోడానికి తనకు ఏడేళ్లు పట్టిందని చెప్పింది. సినిమా పరిశ్రమ తనకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి తన జీవితంలోకి వచ్చిన వ్యక్తులే అని సమంత చెప్పింది. ఈ మాటలు చైతూ గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే అఖిల్, శ్రీయ భూపాల్ పెళ్లి రద్దయ్యాక సోషల్ మీడియాలో అఖిల్ జాతకం వల్లనే అలా అయిందని, నాగ చైతన్య జాతకం ప్రకారం కూడా సమంతతో పెళ్లి జరిగే అవకాశం లేదని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే సమంతగానీ, నాగ చైతన్యగానీ ఈ జ్యోతిష్యాన్ని నమ్మడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా పెళ్లి జరగాల్సిన వేళ సమంత జీవితంలో చాలా నేర్చుకున్నానంటూ... ట్వీట్ చేయడం మాత్రం వెరైటీ. ఆల్ ది బెస్ట్ సమంత.