
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) రూపొందిన ప్యాన్ ఇండియా సినిమా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఊహించని విధంగా హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ నుంచి ఓ రేంజిలో దూసుకుపోతోంది. తగ్గేదేలే అన్నట్లు కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తోంది.
హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. దాదాపు అన్ని చోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మిగతా హీరోల సినిమాలపై పడుతోంది. తెలుగు లో వస్తున్న యాక్షన్ సినిమా అంటే చాలు హిందీ ట్రేడ్ ముందుకు వస్తోంది. ఎంత రేటు అయినా కుమ్మరించేందుకు రెడీ అవుతోంది. అలాంటి పంటే ఇప్పుడు రామ్ తాజా చిత్రానికి పండింది అని చెప్తున్నారు.
యువ హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం #RAPO19. దీని టైటిల్ ‘యోధుడు(The Warrior)’. తమిళ చిత్ర నిర్మాత లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌లో.. రామ్ పోతినేని పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
ఈ సినిమాకు హిందీ మార్కెట్ బిజినెస్ పూర్తైందని సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు అమ్మేసారని సమాచారం. అసలా రేట్లకు అమ్ముతారని ఎవరూ ఊహించరు. రామ్ కెరీర్ లో ఇలా హిందీ రైట్స్ ఈ రేటుకు అమ్ముడవటం రికార్డ్ అని, ఆ క్రెడిట్ పూర్తిగా పుష్పకే చెందుతుంది అంటున్నారు.
ఇక ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫోటోలల్లో రామ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. వీటిని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. దర్శకుడు గతంలో చేసిన రెండు తెలుగు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలో పూర్తిగా విఫలమయ్యాయి.
పందెం కోడి 2 డబ్బింగ్ వెర్షన్ కూడా ప్రజల నుండి పెద్దగా ఆదరణ పొందలేదు. ఇలా లింగుస్వామికి గత కొంతకాలంగా ఎలాంటి హిట్ అందుకోలేదు. దీనితో అయినా ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నాడు.