
బాహుబలి విడుదలకు ముందు ప్రభాస్ తెలుగు సినిమాలకే పరిమితమయ్యాడు. ఆ సినిమా విడుదల తరువాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి హీరోని ఎవరైనా గుర్తు పడతారు.
కానీ ఓ బాలీవుడ్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ గురించి చెప్పమని అడిగితే తెల్లమొహం వేసింది. దీంతో ఆ ప్రశ్న అడిగిన యాంకర్ షాక్ అయింది. పరిస్థితిని గమనించిన హీరో వెంటనే మైక్ తీసుకొని ఆమె ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయని.. తనకు తెలియదని, తన తరఫున నేను సారీ చెబుతున్నా.. అంటూ తెలిపారు.
ఇంతకీ ఈ హీరో, హీరోయిన్ ఎవరంటే.. బాలీవుడ్ లో 'లవ్ యాత్రి' సినిమాలో నటిస్తోన్న హీరో హీరోయిన్లు ఆయుష్ శర్మ, వరీనా హుస్సేన్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం హైదరాబాద్ కి వచ్చింది.
అక్కడ విలేకర్లకి హీరోయిన్ వరీనా హుస్సేన్ కి మధ్య జరిగిన సంభాషణలో ఆమె ప్రభాస్ ఎవరో తెలియదన్నట్లు ముఖం పెట్టింది. ఆ తరువాత మాత్రం కలలో ఎవరిని హగ్ చేసుకోవలనుకుంటున్నారని అడిగితే ప్రభాస్ పేరు కావాలని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.