
సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న చిత్రం `విరూపాక్ష`. హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ సూపర్ నేచురల్ ఎలిమెంట్లతో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీ దండు దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా టీజర్ వాయిదా పడింది. నేడు రిలీజ్ కావాల్సిన టీజర్‌ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.
మెగా అభిమాని ఒకరు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది యూనిట్. భమవరానికి చెందిన రావూరి పాండు అనే మెగా అభిమాని, సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చనిపోయారని, ఆయన మరణం పట్ల నివాళ్లు అర్పిస్తూ టీజర్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇక `విరూపాక్ష` చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌ను విడుదలకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మంగళవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిత్ర టీజర్ ను చూపించారు. ఆయన టీజర్‌ని అభినందించడంతోపాటు యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. సాయి ధరమ్ తేజ్ నూ అభినందించారు. ఇందుకు సుప్రీమ్ హీరో తన మామ పవర్ స్టార్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ.. టీజర్ చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా చాలా ఆక్తికరమైన నోట్ రాశారు.
`ఇంకేమీ అడగలేను. విరూపాక్ష నాకు చాలా కీలకమైన అడుగు. నా గురువు కళ్యాణ్ గారి ఆశీస్సులు, ఆయన చెప్పిన మంచి ఇలాంటి క్షణాన్ని ప్రారంభించడం ఒక వేడుక. కళ్యాణ్ మామా మీ ప్రేమకు, ప్రశంసలకు మరియు ఎల్లప్పుడూ మీరు నా కోసం నిలబడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.