
దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్ర 'విరాటపర్వం'. ఈ చిత్రం జూన్ 17న రిలీజ్ అయ్యి ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అటు కలెక్షన్స్ లోనూ విరాట పర్వం పర్లేదు అనిపిస్తోంది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. యూత్ ను బాగా అట్రాక్ట్ చేసేలా చిత్రీకరించారు దర్శకుడు వేణు ఊడుగుల. మరోవైపు Rana Daggubati, సాయి పల్లవి నటనకు ప్రేక్షకుల నుంచి వంద మార్కులు పడుతున్నాయి.
అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి పలువురి నుంచి అభ్యంతరాలు ఎదుర్కొంటూ వస్తోందీ చిత్ర యూనిట్. సినిమా కూడా కరోనాతో పాటు పలు సమస్యలను పరిష్కరించే క్రమంలో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రెండు రోజుల కింద రిలీజ్ అయ్యింది. కాగా ఈ చిత్రంపై విశ్వ హిందూ పరిషత్ (VHP) సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వీహెచ్ పీకి చెందిన సభ్యుడు హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు.
ఈ సందరర్భంగా వీహెచ్ పీ ఏమంటుందంటే.. విరాట పర్వం మూవీ నక్సలిజం, ఉగ్రవాదాలను ప్రేరేపించేలా ఉందని ఫిర్యాదులో అభిప్రాయపడ్డారు. ఈ తరహా సినిమాల వల్ల యువత పెడదారిన పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి సినిమాలకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డుపైనా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదుతో పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపడుతామని తెలిపారు. ఇప్పటికే సాయి పల్లవి ‘కశ్మీర్ పండట్స్ హత్యలు.. గో హత్యలపై’ చేసిన కామెంట్స్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు సాయి పల్లవికి కొందరు మద్దతివ్వగా.. మరికొందరు ఆమె కామెంట్స్ ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ఇలా సినిమాను నిలిపేయాలంటూ ఫిర్యాదు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది.
1990లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నక్సలైట్ ఉద్యమం చుట్టూ కథను చూపించారు దర్శకుడు వేణు ఉడుగుల. ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. వరంగల్ కు చెందిన సరళ అనే అభ్యుదయ వాది పాత్రలో ‘వెన్నెల’గా సాయి పల్లవి నటించింది. భరతక్కగా ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్ పలు కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా.. డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు.