విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. స్టూడియో కోసం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భూమిని స్టూడియో కోసం వినియోగించకుండా లే అవుట్లు వేసి అమ్మే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
సినీ పరిశ్రమ కోసం విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు సంభందించిన వివాదం మళ్లీ మొదలైంది. గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ‘ఈ స్టూడియో కోసం నగరంలో 35 ఎకరాల భూమి కేటాయించారు. అందులోని 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వంలో ప్రయత్నించారు. దీనిపై నేను సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆపాను. ఇన్నేళ్లలో ఆ భూమిని స్టూడియో కోసం వాడలేదు.ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి’ అని ఎమ్మెల్యే కోరారు.
ప్రభుత్వం ఏ ప్రయోజనం కోసం భూమి కేటాయించిందో అందుకోసమే వినియోగించాలి. అంతేకానీ ఇతర అవసరాలకు వాడరాదు. అలా చేస్తే భూమిని వెనక్కి తీసేసుకోవాలి. విశాఖలో ఇలా ఎన్నో భూములను ప్రభుత్వం లాక్కొంది. అయితే రామానాయుడు స్టూడియో భూమి విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేటాయించిన ఈ భూమిలో లేఅవుట్ వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ పెద్దల హస్తం ఉంటే తప్ప సాధ్యం కాదనే విమ ర్శలు వస్తున్నాయి. గతంలో కేటాయించిన భూమి (34.44 ఎకరాలు)లో సగం భాగం (సుమారుగా 15 ఎకరాలు)లో లేఅవుట్ అభివృద్ధికి ఆ సంస్థ దరఖాస్తు చేయడం.. ఆగమేఘాలపై అనుమతులు ఇవ్వడం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. గతంలో కేవలం రూ.1.81కోట్లకు తీసుకున్న ఈ భూమి విలువ ఇప్పుడు రూ.500 కోట్లు పలుకుతోంది.