బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు యూట్యూబర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గేమింగ్ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీసులు చర్యలు తీసుకున్నారు. డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నది. వీటిని ప్రమోట్ చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్ లు ప్రమోషన్ చేస్తున్న వారిపై పోలీసుల కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా 11మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని సుప్రిత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి , టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుదీర్ లపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 318(4), 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో హర్ష సాయి మీడియాతో మాట్లాడటం జరిగింది. అందులో అతను స్పెషల్ గా మెన్షన్ చేసేదేమిటంటే చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ (వీడియోలో సినిమాస్టార్స్ అభిషేక్ బచ్చన్ , అమీర్ ఖాన్ నుంచి సోనూ సూద్, విజయ్ దేవరకొండ దాకా,అలాగే క్రికెట్ స్టార్స్, టీవి యాంకర్స్ ని అందరూ యాప్ ప్రమోట్ చేయటం చూపించారు) చేస్తూంటే నేను చేయటంలో తప్పేముందని ఆలోచించాను. దానికి లీగల్ గా అన్ని ప్రోపర్ గా ఉన్నాయనే చెక్ చేసుకున్నాను. ఆ వచ్చే డబ్బుతో మరింత మందికి సేవ చేయవచ్చనే నా ఆలోచన అంటూ చెప్పుకొచ్చారు.
ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘా ఉంచి మరీ మరీ ఈ కేసులు నమోదు చేసినట్లు సమాచారం . దీంతో డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేస్తూ జైల్లోకి నెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు యూట్యూబర్లైన భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి తదితరులపై కేసులు నమోదు చేశారు.
ఇక బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పల పాలై తెలంగాణలో గతేడాది వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రముఖ యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో యాప్స్‌ను ప్రమోట్ చేయించుకుంటూ.. సామాన్యులను తమ విషవలయంలోకి యాప్స్ నిర్వాహకులు లాక్కుంటున్నారు. ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలైంది.