
దేశంలో కరోనా వైరల్ క్రమంగా మళ్లీ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే మూడు దశలను దాటిన ప్రజలు నాల్గో దశనూ ధైర్యంగా ఎదుర్కొవాలని, అందుకు సంబంధించిన కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు దేశంలో లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రమక్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే సినీ ప్రముఖులు ఇటీవల కరోనా బారిన పడుతున్నారు. గతేడాది కరోనాకు చలనచిత్ర పరిశ్రమలో దాదాపుగా నటీనటులందరూ గురైన విషయం తెలిసిందే. ఇటీవల నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.
వారం పాటు క్వారంటైన్ లో ఉన్న బాలయ్య ఇటీవలనే కోలుకుని తను నటిస్తున్న ఫిల్మ్ ‘ఎన్బీకే107’ షూటింగ్ కు సిద్ధమయ్యారు. అయితే తాజాగా కన్నడ నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని వరలక్ష్మి స్వయంగా తెలిపింది. తనను కలిసిన నటీనటులు, క్రూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, కోవిడ్ ఇంకా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ ను అభిమానించే వారు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
బెంగళూరుకు చెందిన వరలక్ష్మి శరత్ కుమార్ కన్నడతో పాటు తమిళం, మలయాళంలో చాలా చిత్రాల్లో నటించింది. వెర్సెటైల్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇటు తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. లేడీ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి ప్రస్తుతం తెలుగు, తమిళంలో పదికిపైగా చిత్రాల్లో నటిస్తోంది. బాలయ్య నటిస్తున్న ‘ఎన్బీకే107’లో విలన్ గా నటిస్తోంది. అలాగే సమంత ‘యశోద’ మూవీలోనూ కీలక పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తోంది.