
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన దిగ్గజ నటి బి సరోజా దేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం బెంగుళూరులో సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇందులో చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది కళాకారులు, సరోజాదేవి బంధువులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సి. అశ్వత్థ నారాయణ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు, దర్శకుడు ఉపేంద్ర మాట్లాడుతూ, సరోజాదేవి లేకపోతే తాను హీరో అవ్వలేనని, 'ఎ' సినిమా విడుదలకు, సెన్సార్ సమస్యల నుండి బయటపడటానికి ఆమె సహాయం చేసిందని,
ఆమె ప్రోత్సాహం లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని అన్నారు. విష్ణువర్ధన్, డా. రాజ్‌కుమార్ అవార్డుల లాగా బి. సరోజాదేవి పేరు మీద కూడా అవార్డు ఇవ్వాలని ఆయన కోరారు.
మాజీ ఉపముఖ్యమంత్రి సి. అశ్వత్థ నారాయణ మాట్లాడుతూ, సరోజాదేవి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని, మల్లేశ్వరం 11వ మెయిన్ రోడ్డుకు ఆమె పేరు పెడతామని ప్రకటించారు. సీనియర్ నటి హేమ చౌదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, సరోజాదేవిని స్మరించుకున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో అభినయ సరస్వతిగా పేరుగాంచిన బహుభాషా నటి బి. సరోజాదేవి 87వ ఏట మరణించారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె కొన్నేళ్లుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
బెంగళూరులో చదువుకున్న సరోజాదేవి, ఆ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా, ధనవంతురాలిగా పేరు తెచ్చుకున్నారు. తన సంపదను ఎలాంటి వివాదాలు లేకుండా నిర్వహించుకున్నారనేది అందరికీ ఆసక్తికరంగా ఉండేది. దానికి ఆమె స్వయంగా సమాధానం చెప్పారు.
ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను ఐదో తరగతి వరకే చదువుకున్నానని, చదువు కొనసాగించలేకపోవడం వల్ల కలిగిన నష్టాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నానని చెప్పారు.
కళాకారులు కనీసం అకౌంట్స్ చదవడం, అర్థం చేసుకోవడం కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తన భర్త శ్రీహర్ష తన జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకున్నారని, ఆయన తనను దేవతలా చూసుకున్నారని ఆమె చెప్పారు.