
ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. దశాబ్దాలుగా రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. రాజీవ్ కనకాల సతీమణి సుమ యాంకర్ గా రాణిస్తోంది. అయితే తాజాగా రాజీవ్ కనకాల ఒక ఫ్లాట్ అమ్మకం వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
పోలీసులు రాజీవ్ కనకాలకి నోటీసులు పంపినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే కొంత కాలం క్రితం రాజీవ్ కనకాల పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలో, పసుమాముల రెవెన్యూ పరిధిలో ఉన్న తన ఫ్లాట్ ని విజయ్ చౌదరి అనే వ్యక్తికి విక్రయించారు. ఆ తర్వాత విజయ్ చౌదరి అదే అదే ఫ్లాట్ ని శ్రవణ్ రెడ్డికి అమ్మేశారు.
శ్రవణ్ రెడ్డి డబ్బు మొత్తం చెల్లించినప్పటికీ అతడికి ఫ్లాట్ హ్యాండోవర్ చేయలేదట. దీనితో ఈ ఫ్లాట్ విక్రయంలో ఏదో మోసం జరిగిందని భావించిన శ్రవణ్ రెడ్డి విజయ్ చౌదరిపై రాచకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అదే విధంగా అందులో రాజీవ్ కనకాల పేరు కూడా జోడించారు. దీనితో పోలీసులు రాజీవ్ కనకాలకి నోటీసులు పంపారు.
ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదంపై రాజీవ్ కనకాల ఇంకా స్పందించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకి రానున్నాయి. రాజీవ్ కనకాల చివరగా బ్రహ్మ ఆనందం, గేమ్ ఛేంజర్ లాంటి చిత్రాల్లో నటించారు. రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కూడా బబుల్ గమ్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.