
చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీనటులు క్షణికావేశాలకు, డిప్రెషన్ కి గురై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరిగాయి. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 35 ఏళ్ల పిన్న వయసులోనే ప్రముఖ బుల్లితెర నటుడు సంపత్ జె రామ్ ఆత్మహత్య చేసుకున్నారు.
బెంగుళూరుకి సమీపంలో నేలమంగళలో ఉన్న తన నివాసంలో సంపత్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే సంపత్ ఎలా సూసైడ్ చేసుకున్నారు అనేది క్లారిటీ లేదు. కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు తెలపనప్పటికీ సంపత్ మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
కన్నడ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సంపత్ కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తనకి సీరియల్స్ లో, సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం వల్లే సంపత్ డిప్రెషన్ కి గురయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం సంపత్ కి ఏడాది క్రితమే వివాహం జరిగినట్లు కూడా తెలుస్తోంది.
ఈ విషయాన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తావించలేదు. సంపత్ అగ్ని సాక్షి అనే టివి సీరియల్ తో మంచి గుర్తింపు పొందారు. సంపత్ మరణవార్తని తెలియజేస్తూ అతడి స్నేహితుడు, నటుడు అయిన రాజేష్ ధృవ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'నీ పోరాటం ఇప్పుడే ఆగిపోకూడదు. నువ్వు చాలా సినిమాలు చేయాలి. నీ కలని సాకారం చేసుకునేందుకు ఇంకా చాలా సమయం ఉంది.. తిరిగి రా మిత్రమా' అంటూ రాజేష్ దృవ భావోద్వేగానికి గురయ్యారు. రాజేష్ ధృవ దర్శకత్వంలో సంపత్ 'శ్రీ బాలాజీ ఫోటో స్టూడియో' అనే చిత్రంలో నటించారు.
సంపత్ అకాల మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర విషాదంలో ఉన్నారు. సంపత్ అంత్యక్రియలని అతడి స్వగ్రామం చిక్ మంగుళూరు జిల్లా రాజనరసింహపురంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.