
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సభ అంటే వణికిపోతున్నారు టాలీవుడ్ పెద్దలు. ఆయన తీరుతో ఏపీ ప్రభుత్వం ఎక్కడ మొండిగా తయారవుతుందో అని బెంబేలెత్తుతున్నారు. నాలుగు నెలలుగా నానా కష్టాలు పడి ప్రభుత్వం టికెట్స్ ధరలు పెంచేలా చిరంజీవి లాంటి పెద్దలు ఒప్పించారు. తగ్గించిన టికెట్స్ ధరలు పెంచుతూ త్వరలో జీవో రానుంది. ఈ లోపు పవన్ కళ్యాణ్ సభలు ఏపీ ప్రభుత్వ నిర్ణయం పై ప్రభావం చూపుతాయేమోనని అని కంగారు పడుతున్నారు. ఒక వేళ టికెట్స్ ధరల పెంపు జీవో మరింత ఆలస్యం చేస్తే... దాని వలన నష్టపోయేది చిత్ర పరిశ్రమే. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు.
భీమ్లా నాయక్ (Bheemla Nayak)విడుదల నుండి మే 12న విడుదల కావాల్సిన సర్కారు వారి పాట చిత్రం వరకు ఆచార్య, కె జి ఎఫ్, రాధే శ్యామ్, ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ చిత్రాల విడుదల ఉంది. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాల నిర్మాతలు నష్ట పోకుండా ఉండాలంటే ధరల పెరుగుదల అనివార్యం. టికెట్స్ ధరలు తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా సానుకూల చర్చల ద్వారా ప్రయత్నం చేయాలనేది చిరంజీవి లాంటి పెద్దల అభిప్రాయం. అయితే పవన్ ఒక్క స్పీచ్ తో సమస్య జటిలం చేశారు.
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రులను ఉద్దేశిస్తూ పవన్ పరుష వ్యాఖ్యలు చేశారు. మంత్రులనైతే ఏకంగా సన్నాసులు అంటూ సంబోధించారు. పవన్ ఈ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు కారణంగానే ప్రభుత్వానికి, పరిశ్రమకు గ్యాప్ పెరిగింది. ఒక నిర్ణయాత్మక మీటింగ్ ఏర్పాటుకు నాలుగు నెలల సమయం పట్టింది. చిరంజీవి తన పెద్దరికం, ప్రణాళికలతో సీఎం జగన్ తో మీటింగ్ ఏర్పాటు చేసి, అనుకూల ఫలితాలు తీసుకొచ్చారు.
ఈ మీటింగ్ అనంతరం నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి పేరుతో సభ నిర్వహించిన పవన్ మరలా ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పనిలో పనిగా అన్నయ్య చిరంజీవిలా నేను ప్రాధేయ పడేవాడిని కాదు, పోరాటమే అంటూ ఆయన్ని పరోక్షంగా తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఈ సభ తర్వాత టికెట్స్ ధరల పెంపు జీవో భీమ్లా నాయక్ విడుదల తర్వాతే అని అందరూ డిసైడ్ అయ్యారు. కాగా నేడు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక(Bheemla Nayak prerelease event) జరగనుంది. ఈ సభలో పవన్ మరలా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని టాలీవుడ్ బడా నిర్మాతలు భయపడుతున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం చిత్ర పరిశ్రమను పవన్ రిస్క్ లో పెడుతున్నారని ఇప్పటికే కొందరు పెద్దలు అసహనం వ్యక్తం చేశారు. సినిమా వేడుకల్లో రాజకీయ ప్రసంగాలు చేయడం సబబు కాదంటున్నారు. పవన్ స్పీచ్ కారణంగా రిపబ్లిక్ మూవీ నిర్మాతలు పూర్తిగా నష్టపోయారు. ఓ వర్గం ఆ సినిమాను బహిష్కరించారు. ఆ సినిమా దర్శకుడు దేవా కట్టా కూడా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కలిపి రిపబ్లిక్ నిర్మాతలకు నష్టం చేకూరింది. ఈ నేపథ్యంలో పవన్ నేటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆవేశంగా మాట్లాడితే పరిస్థితి ఏంటని చివరకు భీమ్లా నాయక్ నిర్మాతలు కూడా భయపడుతున్నారు.