కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు అత్యంత అప్తమిత్రుడని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.
అంతకు ముందు కృష్ణంరాజు మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సంతాపం ప్రకటించారు. యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో ‘‘రెబల్ స్టార్’’గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read: కృష్ణంరాజుకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాం.. ఆయన మృతికి కారణమిదే: ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే..
రేపు కృష్ణంరాజు అంత్యక్రియలు..
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన భౌతికకాయాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది.. కేంద్ర మంత్రి అమిత్ షా