చిరంజీవి-బాలకృష్ణ సమకాలీన నటులు. టాప్ స్టార్స్ గా బాక్సాఫీస్ వద్ద తరచుగా పోటీపడతారు. కాగా చిరంజీవి నటించిన ఓ చిత్రం బాలకృష్ణకు చాలా ఇష్టం అట.
చిరంజీవి జన్మదినం నేడు. 1955 ఆగస్టు 22న జన్మించిన చిరంజీవి 69వ ఏట అడుగుపెడుతున్నారు. చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి నట ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిరంజీవి నటించిన ఓ చిత్రం బాలకృష్ణకు చాలా ఇష్టం అట. ఈ విషయాన్ని బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు.
బాలకృష్ణ-చిరంజీవి సమకాలీన నటులు. చిరంజీవికి పోటీ ఇచ్చిన హీరో బాలయ్య అనడంలో సందేహం లేదు. వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద తలపెడితే నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది. అందుకే నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య దశాబ్దాలుగా రైవల్రీ ఉంది. చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. అభిమానులు గొడవలు పడుతున్నా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటారు.
చిరంజీవి కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి నటించిన చిత్రాల్లో బాలయ్యకు ఇష్టమైన చిత్రం ఒకటి ఉంది. ఆ మూవీని బాలకృష్ణ అమితంగా ఇష్టపడతారట. దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన జగదేక వీరుడు అతిలోక సుందరి బాలకృష్ణ బాగా నచ్చిన చిత్రం అట. సాధారణంగా బాలకృష్ణ జానపద, సోషియో ఫాంటసీ చిత్రాల పట్ల మక్కువ చూపిస్తారు. ఈ క్రమంలో ఆయనకు చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి నచ్చిందట.
1990లో విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. వందల రోజులు థియేటర్స్ లో ప్రదర్శించబడింది. ఈ మూవీలో చిరంజీవి-శ్రీదేవి కెమిస్ట్రీ అదుర్స్. శ్రీదేవి గ్లామర్, ఇళయరాజా మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. ఇక చిరంజీవి మాస్ గ్రేస్ ఫ్యాన్స్ కి పండగ అనడంలో సందేహం లేదు.
అదే ఏడాది బాలకృష్ణ నాలుగు చిత్రాలు చేశారు. 50వ చిత్రంగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి మ్యూజికల్ హిట్. కేవీ మహదేవన్ అందించిన ప్రతి పాటా ఓ ఆణిముత్యం. బాలకృష్ణ పక్కా క్లాస్ మూవీ చేశాడు. అలాగే లారీ డ్రైవర్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. ఆ ఏడాది విన్నర్ మాత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి.