మహానటి సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ప్రతి నటుడు కోరుకునేవాడు. అలాంటిది ఓ వర్థమాన నటుడు సావిత్రికి ఏక కాలంలో భర్తగా, కొడుకుగా నటించాడు.
మహానటి సావిత్రి లెగసి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు, తమిళ భాషల్లో ఆమె తిరుగులేని స్టార్డం అనుభవించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు మించిన గౌరవం, కీర్తి సావిత్రికి దక్కింది. ఒక దశలో వారిద్దరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ సావిత్రి తీసుకున్నారు.
సావిత్రితో నటించాలని చాలా మంది నటులు కోరుకునేవారు. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం కోసం ఎదురు చూసేవారు. ఆ ఛాన్స్ కొందరు నటులకు మాత్రమే వచ్చింది.
ఈ తరం హీరోలు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. కానీ ఆరోజుల్లో ఏడాదికి ఒక్కో హీరో 20-30 సినిమాలు చేసేవారు. మూడు షిఫ్ట్ లలో నిరంతరం పని చేసేవారు. అప్పట్లో షూటింగ్ కి విదేశాలకు వెళ్లడం, భారీ సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటివి ఉండేవి కాదు. తెలుగు సినిమాలో దాదాపు తెలుగు నటులు ఉండేవారు. లేదంటే తమిళ నటులు పాత్రలు చేసేవారు.
కాంబినేషన్స్ రిపీట్ అవుతూ ఉండేవి. ఒక సినిమాలో చెల్లిగా చేసిన నటి, మరో సినిమాలో అదే హీరో పక్కన హీరోయిన్ గా నటించేది. ఇలాంటి విచిత్రమైన కాంబినేషన్స్ అప్పట్లో చోటు చేసుకునేవి. ఇప్పటి హీరోలు ఒక హీరోయిన్ తో రెండు మూడు చిత్రాలు చేయడమే ఎక్కువ.
ఎన్టీఆర్ కి మనవరాలిగా చేసిన శ్రీదేవి... పెద్దయ్యాక ఆయనతో జతకట్టింది. అలాగే ఎన్టీఆర్ కి భార్యగా నటించిన అంజలి... అనంతరం ఆయనకు తల్లిగా చేసింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి.
వీటన్నింటికీ మించిన స్ట్రేంజ్ కాంబినేషన్ సావిత్రి విషయంలో చోటు చేసుకుంది. నటుడు గిరిబాబు... సావిత్రికి భర్తగా, కొడుకుగా నటించాడు. అది కూడా ఏక కాలంలో. 1973లో గిరిబాబు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆయన డెబ్యూ మూవీ జగమేమాయ.
అదే ఏడాది జ్యోతి లక్ష్మి టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో సావిత్రికి భర్తగా నటించే అవకాశం గిరిబాబుకు దక్కింది. అలాగే అనగనగా ఓ తండ్రి చిత్రంలో గిరిబాబు సావిత్రికి కొడుకుగా కనిపించాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ఏక కాలంలో జరిగాయట.
మధ్యాహ్నం వరకు జ్యోతి లక్ష్మి షూటింగ్ లో సావిత్రికి భర్తగా.. మధ్యాహ్నం తర్వాత అనగనగా ఓ తండ్రి చిత్రంలో ఆమెకు కొడుకుగా నటించేవాడట. ఇది చాలా అరుదైన విషయం. కెరీర్ ఆరంభంలోనే గిరిబాబుకు మహానటితో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం దక్కింది.
ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత జనరేషన్ హీరోల్లో శోభన్ బాబు మాత్రమే చదువుకున్న అమ్మాయిలు చిత్రంలో సావిత్రితో కలిసి నటించారు. సూపర్ స్టార్ కృష్ణకు అవకాశం దక్కకపోవడం విశేషం. అందుకే గిరిబాబు పెట్టిపుట్టాడని చెప్పొచ్చు.
గిరి బాబు హీరో కావాలని పరిశ్రమకు వచ్చాడు. అయితే విలన్ గా ఆయన ఫేమస్ అయ్యాడు. 70-80లలో కరుడుగట్టిన విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. 90లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి... సుదీర్ఘ కెరీర్ కి బాటలు వేసుకున్నాడు. గిరిబాబు కొడుకు రఘుబాబు విలన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. అనంతరం కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు.
ఎలాంటి సినిమా నేపథ్యం లేని పల్లెటూరి పిల్ల సావిత్రి నాటకాలాడుతూ... చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. తిరుగులేని స్టార్డం అనుభవించింది. దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ. మూగమనసులు వంటి అద్భుతమైన చిత్రాల్లో సావిత్రి నటించారు.
సావిత్రికి దానగుణం ఎక్కువ. సాయం అంటూ వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేది. కాలం గడిచేకొద్దీ ఆమె ఆస్తులు, అంతస్తులు కరిగిపోయాయి. మరోవైపు భర్తకు దూరమై మనో వేదన అనుభవించింది. జెమినీ గణేశన్ చేసిన మోసం నుండి బయటపడేందుకు మద్యానికి బానిసయ్యింది.
ఆమె కెరీర్ కూడా నెమ్మదించింది. తల్లి పాత్రలకు పడిపోయింది. చివరికి అనారోగ్యం పాలైంది. 19 నెలలు కోమాలో ఉన్న సావిత్రి కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆమెను చూసేవారు, ఆదరించేవారు కరువయ్యారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథను మహానటి టైటిల్ తో తెరకెక్కించారు. 2018లో విడుదలైన మహానటి బ్లాక్ బస్టర్ హిట్. తెలుగుతో పాటు తమిళంలో కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. మహానటి సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్ ని జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.