
చిన్న సినిమాగా రూపొందిన 'ది కేరళ స్టోరీ' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా క్వాలిటీ,కథ,కథనం వంటివి ప్రక్కన పెడితే..కేవలం. వివాదాస్పద అంశాలుతో ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. దీనికి తోడు ఓ వర్గం వారు ఈ సినిమాకు పెద్ద ఎత్తున మద్దతు తెలపడం కలిసొచ్చింది. దాంతో భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి.
ఈ సినిమాలో నిజం లేదని, కావాలనే కల్పిత కథతో ఈ సినిమా రూపొందించారని కేరళ ప్రభుత్వం ఈ సినిమాపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం, తమిళనాడుతో శాంతి భద్రతల సమస్య కారణంగా ఈ మూవీ ప్రదర్శనని చాలా వరకు థియేటర్లు నిలిపివేయడం, బెంగాల్ ప్రభుత్వం ఈ సినిమాని తమ రాష్ట్రంలో బ్యాన్ చేయడం తెలిసిందే. దీంతో `ది కేరళ స్టోరీ` దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
పది కోట్లు వసూళ్లు సాధిస్తే గొప్ప విషయం అనుకున్న సినిమా కాస్త ఏకంగా రూ.200 కోట్ల పైగా వసూళ్లు సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. కేరళ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చి న ఉత్సాహంతో అదే టీమ్ మరో చిత్రాన్ని ప్రకటించింది. ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ (Sudioto Sen)దర్శకత్వంలో విపుల్ అమృత్ లాల్ షా (Vipul Amrutlal Shah) మరో చిత్రం ఎనౌన్స్ చేసారు.
`బస్తర్` టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నారు. `ది కేరళ స్టోరీ` విడుదలై యాభై రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ మూవీ దర్శకనిర్మాతలు సోషల్ మీడియా వేదికగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు `బస్తర్`(Bastar) అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ కాన్సెప్ట్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.
ఇంతకీ బస్తర్ విషయానికి వస్తే..ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోరని బస్తర్ జిల్లా దట్టమైన అటవీ ప్రాంతం.ఈ ప్రాంతం గత కొన్ని దశాబ్దాలుగా పీపుల్స్ వార్‌కు కీలక స్థావరంగా మారింది. బస్తర్‌లో నిత్యం ఏదో ఒక సందర్భంలో నక్సల్స్‌కు, స్పెషల్ పార్టీ పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమస్యాత్మక ప్రాంతం నేపథ్యంలో సుదీప్తో సేన్ `బస్తర్` పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో `దేశాన్ని అల్ల కల్లోలం చేస్తున్న అత్యంత రహస్యాలు` అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తామంటూ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. నక్సలిజం నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాతో మరో తేనె తుట్టెను కదుపుతున్నారా, మరో వివాదానికి శ్రీకారం చుడుతున్నారా వంటి సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.అసలు సినిమాలో విషయం ఏమిటి... ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే 2024, ఏప్రిల్ 5 వరకు వేచి ఉండాల్సిందే.