Bigg Boss Telugu 5: యాంకర్‌ రవి కోసం ఆందోళన చేసిన తెలంగాణ జాగృతి విద్యార్థి నాయకుడిపై వేటు

By Aithagoni RajuFirst Published Nov 29, 2021, 6:40 PM IST
Highlights

బిగ్‌బాస్‌ తెలుగు 5, ఆదివారం ఎపిసోడ్‌లో యాంకర్‌ రవి ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థి నాయకుడిపై వేటు పడింది. 

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5)వ సీజన్‌ నుంచి అనూహ్యంగా 12వ వారంలో యాంకర్ రవి(Anchor Ravi) ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా రవి ఎలిమినేట్ కావడం అందరిని షాక్‌కి గురి చేస్తుంది. దీనిపై రవి అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. బిగ్‌బాస్‌ నిర్వహకులపై ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బిగ్‌బాస్‌ తెలుగు 5 నిర్వహణ, ఓటింగ్‌ చర్చనీయాంశంగా మారింది. 

ఆదివారం ఎపిసోడ్‌లో నామినేషన్‌లో చివరగా కాజల్‌, రవి ఉన్నారు. సన్నీ తన ఫ్రెండ్‌ కోసం తన వద్ద ఉన్న ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ని ఉపయోగించాడు. దీంతో ఆమె సేవ్‌ అయ్యింది. అయితే ఆమె కంటే రవికి తక్కువ ఓట్లు వచ్చాయని హోస్ట్ నాగార్జున చెప్పారు. ఎప్పుడూ టాప్‌లో ఉండే రవికి తక్కువ ఓట్లు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే ఏకంగా అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్(బిగ్‌బాస్‌ 5 సెట్‌ ఉన్న స్టూడియో) వద్ద ఆందోళనకి దిగారు. వీరిలో రంగారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నాయకుడు నవీన్‌ గౌడ్‌ ఉన్నారు. 

బిగ్‌బాస్‌ షోకి వస్తున్న ఓట్లని బహిర్గతం చేయాలని, తెలంగాణ వ్యక్తికి అన్యాయం జరిగిందని నవీన్‌ గౌడ్‌ కొంత మందితో వచ్చి స్డూడియో వద్ద ఆందోళనకి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హౌజ్‌లో వీక్‌గా ఉన్న వారికి ఎక్కువ ఓట్లు రావడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది హాట్‌ టాపిక్‌గా మారడంతోపాటు, వివాదంగానూ మారింది. అయితే దీనిపై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం స్పందించింది. నవీన్‌ గౌడ్‌పై వేటు వేసింది. 

అన్నపూర్ణ స్టూడియోస్ ముందు జరిగిన ఆందోళనలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం  రంగారెడ్డి జిల్లా కన్వీనర్ నవీన్ గౌడ్ సంస్థ అనుమతి లేకుండా పాల్గొన్నందుకు అతని మీద క్రమశిక్షణ చర్యగా విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ పదవి నుంచి తక్షణమే తొలగించడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ అర్చన సేనాపతి వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఇతనొక్కడే పాల్గొన్నాడని, తెలంగాణ జాగృతి సంస్థకు, ఆందోళన కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

బిగ్‌బాస్‌ తెలుగు 5, 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఇంకా మూడు వారాలే మిగిలి ఉన్నాయి. ఇందులో మరో ఇద్దరు రెండు వారాల్లో ఎలిమినేట్‌ అవుతారు. మూడో వారం(15వ)లో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ముగుస్తుంది. ఆ రోజు విజేతని నిర్ణయిస్తారు. ప్రస్తుతం హౌజ్‌లో సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్‌, మానస్‌, కాజల్‌, సిరి, ప్రియాంక ఉన్నారు. 

also read: Bigg Boss Telugu 5: రవి ఎలిమినేషన్ లో కుట్ర కోణం.. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత

also read: Bigg Boss Telugu 5: రవి ఎలిమినేటెడ్.. వెక్కి వెక్కి ఏడ్చిన సన్నీ, కాజల్ కోసం ఎవిక్షన్ ప్రీ పాస్
 

click me!