
తారకరత్న మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందమూరి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే. నిన్న రాత్రినే అంబులెన్స్ లో తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కి తరలించారు. హైదరాబాద్ శివారులోని తన నివాసంలో తారకరత్న భౌతికకాయాన్ని ఉంచారు. అక్కడకి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి తారకరత్న మృతదేహాన్ని సందర్శించి నివాళ్లు అర్పిస్తున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ విజయ సాయిరెడ్డి, బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రాజేంద్రపసాద్, నారా లోకేష్ వంటి వారంతా తారకరత్నకి నివాళ్లు అర్పించారు. ఇక ఈ రోజు(ఆదివారం) తన నివాసంలోనే తారకరత్న భౌతికకాయాన్ని ఉంచబోతున్నారు. రేపు ఉదయం 8.45నిమిషాలకు ఆయన మృతదేహాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌కి తరలించబోతున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు అంతిమయాత్ర కొనసాగించబోతున్నట్టు నటుడు మాదాల రవి తెలిపారు.
తారకరత్న కుటుంబ సభ్యులు, బాలకృష్ణ, విజయసాయిరెడ్డి కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే బాలకృష్ణ నిర్ణయించిన ముహుర్తానికే అన్ని కార్యక్రమాలు చేయబోతున్నారట. సాయంత్రం ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. బాలకృష్ణ జాతకాలు, ముహూర్తాలను బాగా నమ్ముతారు. ఆయన ఏం చేసినా ముహూర్తం పెట్టుకుని చేస్తారు. ఇప్పుడు తారకరత్న విషయంలోనే ఆయనే లీడ్ తీసుకుంటున్నారని, ఆయన నిర్ణయించిన టైమ్‌కే అంత్యక్రియలు నిర్వహించాలని ఫ్యామిలీ మెంబర్స్ సైతం నిర్ణయించినట్టు సమాచారం.
నిజానికి తారకరత్న గత నెల 27న కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రలో అస్వస్థతకు గురైనప్పట్నుంచి బాలకృష్ణ ఆయన వెన్నంటే ఉన్నారు. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ అందించడంలో ఆయన దగ్గరుంచి చూసుకున్నారు. బెంగుళూరుకి తరలించాక కూడా కొన్ని రోజులు అక్కడే ఆసుపత్రిలో స్టే చేశారు బాలయ్య. బాబాయ్ అంటే తారకరత్నకి ఎంతో ఇష్టం. అభిమానం. ఏకంగా ఆయన ఫోటోని భుజంపై టాటూకూడా వేయించుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీంతో తారకరత్న అనారోగ్యానికి గురి కావడంతో బాలయ్య తల్లడిల్లిపోయారు. ఆయన్ని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. తన సినిమా షూటింగ్‌ని ఆపేసి మరీ తారకరత్న కోసమే టైమ్ కేటాయించడం విశేషం. ఇప్పుడు చివరి కార్యక్రమాల్లోనూ బాలయ్యనే ముందుండి నడిపిస్తుండటం మరో విశేషం.