
తమిళ స్టార్ హీరో.. డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయ్ కాంత్ ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇప్పటికే ఆయన పార్థివదేశానికి నివాళి అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికన అభిమానులు, సెలబ్రెటీలు, నాయకులు పెద్దఎత్తున నివాళి అర్పిస్తున్నారు. తాజాగా తమిళ హీరో విశాల్ (Vishal) ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు.
విజయ్ కాంత్ మరణంతో తను ఎంత కుమిలిపోతున్నారో చెప్పుకొచ్చారు. గుక్కపెట్టి ఏడుస్తూ ఆయనపై ఉన్న ప్రేమను, ఆయన లేరనే బాధను వ్యక్తం చేశారు. ‘నా జీవితంలో నేను కలిసిన అత్యంత ఉన్నతమైన వారిలో Captain Vijaykanth అన్న ఒకరు. ఆయన మరణవార్త విన్న తర్వాత నాకు కన్నీళ్లు ఆగడం లేదు. అన్న నేను మీ నుండి సామాజిక సేవను నేర్చుకున్నాను. ఈ రోజు వరకు మిమ్మల్ని అనుసరిస్తూనే ఉన్నాను. ఎప్పటికీ అలానే ఉంటాను. మన సమాజానికి అవసరమయ్యే అలాంటి వారిని దేవుడు ఎందుకు అంత త్వరగా దూరం చేస్తాడో తెలియదు. నిన్ను చివరిసారి చూడడానికి అక్కడ లేనందుకు చింతిస్తున్నాను. నాకు స్ఫూర్తినిచ్చిన యోధుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మీరు చాలా కాలం గుర్తుండిపోతారు. ఎందుకంటే ప్రజలకు, నడిగర్ సంఘం కోసం మీరు చేసిన సేవ ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.’ అంటూ వీడియోను విడుదల చేశారు.
విజయ్ కాంత్ మరణంపై విశాల్ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోకన్నీళ్లు పెట్టుకోవడంతో తన అభిమానులు కూడా స్పందిస్తున్నారు. థైర్యంగా ఉండాలంటూ చెబుతున్నారు. ఇక విజయ్ కాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కెప్టెన్ విజయకాంత్ తన 71వ ఏటా మృతి చెందారు. ఇప్పటికే ఆరోగ్యం బాగోలేక చికిత్స పొందారు. నిన్న మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థతి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ కన్ను మూశారు. అయితే విజయ్ కాంత్ కు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.