
విలక్షణ నటుడిగా తెలుగు తమిళ భాషల్లో విశేషంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు హీరో సూర్య. తమిళ, తెలుగు భాషల్లో భారీగా అభిమానులని సొంతం చేసుకున్న కొద్ది మంది హీరోల్లో సూర్య ఒకరు. గజినీగా మతిమరుపుతో ఆకలరించినా, సింగం చిత్రాలతో పవర్ ఫుల్ పోలీస్ గా మెప్పించినా.. ఆకాశం నీ హద్దురా అనే వైవిధ్య భరిత చిత్రంతో అలరించినా అది సూర్యకే చెల్లింది.
సూర్య నుంచి రాబోతున్న మరో ప్రయోగాత్మక చిత్రం 'జై భీం'. ఈ చిత్రంలో సూర్య గిరిజనుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది పాత్రలో కనిపించనున్నాడు. జ్ఞానవేల్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక దంపతులిద్దరూ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఖరారైంది. నేరుగా ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో దివాళి కానుకగా నవంబర్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. తెలుగులో కూడా అదే రోజు నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుంది.
మిస్టరీ, డ్రామా కలయికతో ఈ చిత్రం రానుంది. గిరిజన జంట సెంగెని, రాజకన్ను లతో విధి వల్ల ఊహించని చిక్కుల్లో పడతారు. రాజకన్ను అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత కనిపించకుండా కనుమరుగైపోతారు. దీనితో సెంగెని లాయర్ చంద్రు సహాయం కోరుతారు. దీనితో రంగంలోకి దిగుతాడు లాయర్ చంద్రు.. ఈ ప్రయత్నంలో చంద్రుకి ఎదురైనా అడ్డంకులు ఏంటి.. తన ప్రయత్నం ఫలించిందా.. గిరిజన జంటకు న్యాయం చేయగలిగాడా ? అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిన అంశాలు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, రాజీషా విజయం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సూర్య ఆకాశం నీ హద్దురా చిత్రంతో ఓటిటిలో రికార్డులు సృష్టించాడు. మరి 'జై భీం'తో మరోసారి ప్రభంజనం సృష్టిస్తాడేమో చూడాలి.