
విశాఖ మధురవాడలోని రామానాయుడు సినీ స్టూడియో ఏర్పాటుకు 2003లో కేటాయించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ లేఅవుట్లు వేసి స్థలాలు విక్రయించడంపై స్టే విధిస్తూ జనవరి 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు సోమవారం జస్టిస్ అభయ్ ఎస్.ఓక, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని 2003 సెప్టెంబరు 13న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహాయించి ఇతర కార్యకలాపాలకూ ఉపయోగించకూడదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొనసాగించాలని పిటిషనర్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం మన్నించింది. వివరాల్లోకి వెళితే...
రామానాయుడు స్టూడియోకు 2003లో సినీ అవసరాలకు వినియోగించేందుకు నాటి ప్రభుత్వం 35 ఎకరాల భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. కొండ మీద ఈ భూమి ఉంటుంది. ఇక్కడ కొంత స్థలంలో రామానాయుడు స్టూడియోను నిర్మించారు. ఖాళీగా ఉన్న భూమిని కోస్టల్ నిబంధనలకు విరుద్దంగా లేఅవుట్ చేసి 34.44 ఎకరాల్లో సర్వేనంబరు 387/పిలోని 15.80 ఎకరాలను రెసిడెన్షియల్ లేఅవుట్‌గా మార్చేందుకు సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేసుకున్న దరఖాస్తుకు అనుమతిస్తూ గతేడాది మార్చి 2న జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలను విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో సవాలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హైకోర్టు కేసు కొట్టివేయడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రామకృష్ణబాబు పిటిషన్‌పై జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.
అక్కడ భూమి ఏ పర్పస్ కోసం కేటాయించారు? ప్రస్తుతం లేఅవుట్ వేశారా?, కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. విశాఖలో సినీ స్టూడియో నిర్మాణానికి భూములు కేటాయించారని, అందుకు అనుగుణంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా లేఅవుట్ వేసి అమ్మకాలకు సిద్దంగా ఉంచారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో ప్రభుత్వం 2003లో కేటాయించిన అవసరాలు మినహా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సహా ప్రతివాదులకు నోటీసులిచ్చింది. మార్చి 11లోపు వాటిపై స్పందించాలని ఆదేశించింది.
దాని ప్రకారం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ అయ్యాయని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని రామకృష్ణబాబు తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ కేసును అప్పీల్ కింద విచారణకు స్వీకరిస్తూ జనవరి 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో 8వ ప్రతివాదిగా ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున కౌంటర్ దాఖలుకు అనుమతించాలని ఆ సంస్థ తరఫు న్యాయవాది విన్నపాన్ని న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓక అంగీకరించారు. ఆరు వారాల గడువునిచ్చారు. దానిపైన సమాధానం దాఖలు చేయాలనుకుంటే నాలుగు వారాల్లోపు చేయొచ్చంటూ విచారణను వాయిదా వేశారు.