
కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాహసానికి మారు పేరు ఆయన. తెలుగు సినీ పరిశ్రమకి చాలా కొత్త విషయాలను, టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కృష్ణదే. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా (గూఢచారి 116) ఆయనే చేశారు. మొదటి కౌబాయ్ మూవీ (మోసగాళ్లకు మోసగాడు) చేసిందీ ఆయనే. తొలి ఫుల్ స్కోప్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’తో వాహ్వా అనిపించుకున్నారు. స్టీరియోఫోనిక్ సిక్స్ ట్రాక్ సౌండ్ టెక్నాలజీని వాడిన మొదలటి సినిమా కూడా ఇదే. ‘కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్‌ఓ సాంకేతికతను పరిచయం చేశారు. ‘గూడుపుఠాణి’తో ఓఆర్‌డబ్ల్యూ కలర్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం ‘భలేదొంగలు’ కూడా కృష్ణదే.
ఇక కృష్ణ చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రం "సింహాసనం". సూపర్ హిట్ "బాహుబలి" చిత్ర తరహాలో 35 ఏళ్ళ క్రితమే సూపర్ స్టార్ సింహాసనం చిత్రాన్ని సాహసంతో బారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. రిలీజ్ టైమ్ కు ఏం రేంజిలోక్రేజ్ ఉందంటే..ఈ సినిమా టికెట్స్ కోసం థియేటర్స్ ముందు 12 కిలోమీటర్ల మేర జనాలు క్యూ కట్టారు.అలాగే విజయవాడలో ఆ సినిమా విడుదలైన రాజ్ థియేటర్ ఉన్న వీధి మొత్తం బ్లాక్ అయ్యిపోయింది. పోలీస్ లు 144 సెక్షన్ పెట్టారు. టిక్కెట్ చూపించిన వాళ్ళనే ఆ రోడ్డులో నడవనిచ్చారు. ఈ విషయాన్ని కృష్ణగారు స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పారు. ఇంత క్రేజ్ తెచ్చుకున్న తెలుగు సినిమా చరిత్రలో అదే మొదటిది చివరిది అని చెప్పొచ్చు.
1986లో విడుదలైన ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ చిత్రాన్ని 53 రోజుల షెడ్యుల్ లో కేవలం 3 కోట్ల 50 లక్షల బడ్జెట్ తో పూర్తి చేశారు. ఈ సినిమా విజయ యాత్రకి కార్యక్రమానికి సూపర్ స్టార్ అభిమానులు దాదాపుగా 400 బస్సులలో హాజరయ్యారు. అంతేకాకుండా అప్పట్లో రాష్ట్ర రాజధానిగా ఉన్న చెన్నైలో సింహాసనం చిత్రం 100 రోజుల వేడుక కూడా జరుపుకుంది. ఏదైమైనా "సింహాసనం" చిత్రం.. 1980 లో విడుదలైన ఒక "బాహుబలి".
ఇక బాక్సాఫీస్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మద్రాస్‌లో వంద రోజులు కంప్లీట్ చేసుకున్న తొలి తెలుగు సినిమా కృష్ణ నటించిన ‘చీకటి వెలుగులు’ అని రికార్డులు చెబుతున్నాయి. ‘అల్లూరి సీతారామరాజు’ అయితే హైదరాబాద్‌లో సంవత్సరం పాటు ఆడి రికార్డును నెలకొల్పింది. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుఫులు, ఊరికి మొనగాడు, ఈనాడు, అగ్నిపర్వతం.. ఇలా చాలా సినిమాలు తిరుగులేని విజయాల్ని అందించాయి. ముప్ఫై సంక్రాంతులకు ఆయన సినిమాలు విడుదలైతే.. 1976 నుంచి ఇరవయ్యొక్కేళ్ల పాటు కంటిన్యుయస్‌గా ప్రతి సంక్రాంతికీ ఆయన సినిమా విడుదలవడం మరో రికార్డ్.